టిడిపి సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిపై ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. యనమలకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియడం లేదని, ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి నిజాలు తెలియకే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని బుగ్గన ఆరోపించారు. ఏపీ చరిత్రలో టిడిపి ప్రభుత్వం చేసినన్ని అప్పులు మరే ప్రభుత్వం చేయలేదని బుగ్గన సంచలన ఆరోపణలు చేశారు.
చంద్రబాబు పాలనలో కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో పెట్టారని, చంద్రబాబు బకాయి పెట్టిన పంట రుణాలు రూ.74 కోట్లను వైసీపీ సర్కార్ చెల్లించిందని బుగ్గన అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అప్పులు 15 శాతం మాత్రమే పెరిగాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో బుగ్గన వ్యాఖ్యలకు యనమల గణాంకాలతో సహా కౌంటర్ ఇచ్చారు. చీకట్లో అద్దం చూపించి పొగుడుకున్న రీతిలో బుగ్గన మాటలు ఉన్నాయని యనమల ఎద్దేవా చేశారు.
అందమైన అబద్ధాలతో వాస్తవాలను కప్పిపుచ్చాలని బుగ్గన చూస్తున్నారని సెటైర్లు వేశారు. స్మార్ట్ మీటర్ల పేరుతో 3500 కోట్ల రూపాయల స్కామ్ కు తెరతీశారని యనమల మండిపడ్డారు. రూ.300 విలువ చేసే మీటర్ కు రూ.35000 పెట్టి కుంభకోణం చేస్తున్నారని మండిపడ్డారు. ఏడు నెలల్లో 53,500 కోట్లు అప్పు చేసిన జగన్ అది చాలక మారిటైం బోర్డు ద్వారా మరో ఐదు వేల కోట్ల రూపాయల అప్పు చేసేందుకు ఎందుకు రెడీ అయ్యారని యనమల చురకలంటించారు.
2014 నుంచి 2019 మధ్యలో ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు 2 లక్షల 57 వేల 500 కోట్లు మాత్రమే అని, కానీ మూడున్నరేళ్లలో జగన్ నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని ఆరోపించారు. ఇదంతా తెలిసి కూడా బుగ్గన అలా వ్యాఖ్యానించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. బాబు హయాంలో కౌలు రైతులు దాదాపు పదివేల కోట్ల రూపాయల రుణం పొందారని, కానీ, జగన్ హయాంలో అది 4000 కోట్ల రూపాయల లోపే ఉందని యనమల అన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా బుగ్గన అబద్ధాలకు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోయిందని యనమల మండిపడ్డారు.