టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడితో పాటు నగరి ఎమ్మెల్యే, వైసీపీ నేత రోజు విమాన ప్రమాదం నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. రాజమండ్రి నుంచి తిరుపతికి వీరు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో, తిరుపతిలో ల్యాండ్ చేయడం సాధ్యం కాక గాల్లోనే గంటపాటు విమానం చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో యనమల, రోజా సహా ప్రయాణికులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అయితే, తిరుపతిలో మబ్బులు పట్టి ఉన్నాయని, రన్ వే కనిపించడం లేదని, అందుకే బెంగుళూరు విమానాశ్రయంలో ల్యాండ్ చేస్తున్నామని ప్రయాణికులకు విమాన సిబ్బంది చెప్పారు. ఆ తర్వాత బెంగుళూరులో విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, అక్కడ ల్యాండ్ అయిన తర్వాత కూడా దాదాపు 4 గంటలపాటు విమానం డోర్లు తెరవకుండా ప్రయాణికులందరినీ సిబ్బంది లోపాలే ఉండాలని కోరారు. అధికారుల నుంచి తమకు ఆదేశాలు వచ్చాకే తలుపులు తీస్తామని చెప్పడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు ప్రకటించడంతో వారి బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.
తీరా, చివరకు తిరుపతి నుంచి బెంగుళూరుకు వచ్చినందుకు రూ.5వేలు అదనంగా ఇవ్వాలని ప్రయాణికులను డిమాండ్ చేశారని రోజా అన్నారు. ఈ క్రమంలోనే ఇండిగో విమాన యాజమాన్య తీరుపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగోపైన కేసు వేస్తానని రోజా చెప్పారు. కాగా, ఈ విమానంలో యనమల, రోజాతోపాటు టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు సహా పలువురు ప్రముఖులతో కలిసి 70 మంది ప్రయాణికులున్నారు.