రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మరింత కాక పుట్టిస్తోంది. ఈ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ పాత్ర ఉందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తనకు ఏ మాత్రం సంబంధం లేదని సంజయ్ వాధిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే రా! యాదాద్రిలో ప్రమాణం చేద్దాం.. అన్నారు. కానీ, కేసీఆర్ మాత్రం ఈ విషయంలో మౌనంగానేఉన్నారు.కానీ, బండి మాత్రం.. తనంతట తాను.. యాదాద్రికి చేరుకుని.. తడిబట్టలతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పాదాల దగ్గర ప్రమాణం చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలుతో సంబంధం లేదంటూ… తడిబట్టలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నిజాయితీ నిరూపించుకోవడానికి.. సీఎం కేసీఆర్ కూడా ప్రమాణం చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించలేదని స్వామివారిపై ఒట్టేసి చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఒట్టి కట్టుకథ కాకుంటే.. కేసీఆర్ కూడా యాదాద్రికి రావాలని బండి డిమాండ్ చేశారు.
మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ఉన్న బండి సంజయ్…బీజేపీ నాయకులతో కలిసి యాదాద్రికి బయల్దేరి వచ్చారు. ఇచ్చిన మాట మేరకు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాలతో బీజేపీకి సంబంధం లేదన్నారు. అందుకే స్వామివారిపై ప్రమాణం చేశానని తెలిపారు. అనంతరం లక్ష్మీనరసింహ స్వామికి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మునుగోడు ఎన్నికలకు ముందు.. అధికార పార్టీ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నాయనే అంశం సంచలనం సృష్టించింది. సైబరాబాద్ పోలీసులు తమకు అందిన సమాచారంతో హైదరాబాద్ శివారు మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం రాత్రి సోదాలు చేశారు.
టీఆర్ ఎస్‌కు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేశారు. అయితే.. వీరిని పోలీసు కస్టడీకి కోర్టు నిరాకరించింది.