సాదాసీదా మనిషి అహం దెబ్బ తింటేనే.. పరిణామాలు ఒక రేంజ్ లో ఉంటాయి. కాకుంటే వాటి పరిధి తక్కువగా ఉండొచ్చు. అలాంటిది ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా పేరున్న వ్యక్తి.. ఒక విషయంలో దాని సంగతి చూడాలని డిసైడ్ అయిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్న దానికి నిదర్శనంగా ట్విటర్ అనే పేరున్న కంపెనీని కొనుగోలు చేయటమే కాదు.. దాని పేరును మార్చేసేందుకు సైతం వెనుకాడని తెంపరితనం ఎలాన్ మస్క్ సొంతంగా చెప్పొచ్చు. అలాంటి ఆయన తాను కొనుగోలు చేసిన ట్విటర్ అలియాస్ ఎక్స్ విషయంలో మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఇప్పటివరకు వెబ్ ప్రపంచంలో తిరుగులేని వీడియో యాప్ గా మారిన యూట్యూబ్ కు పోటీగా మస్క్ మాష్టారు ‘ఎక్స్ టీవీ’ యాప్ ను తీసుకొచ్చేందుకు వీలుగా ప్లానింగ్ చేయటం ఆసక్తికరంగా మారింది. యూట్యూబ్ కు పోటీగా తీసుకొచ్చే ఈ వీడియో యాప్ ను అమెజాన్.. శామ్ సంగ్ వినియోగదారులకు వీలుగా టీవీ యాప్ ను ప్రారంభించేందుకు వీలుగా ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. దీనికి సంబంధించిన సంచలన రిపోర్టును ఫార్చ్యూన్ మ్యాగ్ జైన్ వెలుగులోకి తీసుకొచ్చింది.
ఇలాంటివేళ.. ఎక్స్ టీవీ యాప్ మీద ఒక ప్రశ్నను ఆన్ లైన్ లో మస్క్ ను అడగ్గా.. ఆయన స్పందించారు. త్వరలోనే స్మార్ట్ టీవీల్లో లాంగ్ ఫార్మ్ వీడియోల్ని తీసుకురానున్నట్లుగా పేర్కొన్నారు. వేలాది కోట్లు పోసి కొనుగోలు చేసిన ట్విటర్ కు కొత్త హంగుల్ని కల్పిస్తున్న మస్క్.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో ఎక్స్.కామ్ ను ఎవ్రీథింగ్ యాప్ గా మార్చే యోచనలో ఉన్న విషయం తెలిసిందే.
అందుకు తగ్గట్లే యాప్ లో నగదు లావాదేవీల సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. గత అక్టోబరులో ఎంపిక చేసిన వియోగదారుల కోసం వీడియో.. ఆడియో కాలింగ్ వెర్షన్ ను విడుదల చేశారు. అయితే.. ఇదంతా తొలి దశగా అప్పట్లో చెప్పటం తెలిసిందే. ఇప్పుడు టీవీల్లో ఎక్స్.కామ్ టీవీ యాప్ ను తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఎక్స్.కామ్ లో లాంగ్ వీడియోల్ని టీవీల్లో చూసే వెసులుబాటును త్వరలోనే తీసుకొచ్చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మొత్తానికి ఇప్పటివరకు తిరుగులేని అధిక్యతలో ఉన్న యూట్యూబ్ ప్రాభవానికి గండికొట్టే దిశగా అడుగులేస్తున్న మస్క్.. రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలకు తెర తీస్తారో చూడాలి.