గుంటూరు నగర శివారులో చోటు చేసుకున్న ఒక ఉదంతం సంచలనంగా మారింది. విన్నంతనే ఒళ్లు మండే ఈ ఉదంతంలోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని చుక్కలపల్లి వారి పాలెనికి చెందిన 18 ఏళ్ల తేజ అమరావతిలోని చిన్నమ్మ వారింట్లో ఉంటూ చదువుకుంటున్నాడు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న తేజ తల్లిదండ్రులు తాజాగా ఊరి నుంచి వచ్చారు. అనంతరం వారు తిరిగి ఊరికి వెళ్లేందుకు కారులో బయలుదేరారు. వారిని ఊళ్లో దింపి తిరిగి బయలుదేరాడు. గుంటూరులోని గోరంట్ల ఇన్నర్ రింగు రోడ్డు దగ్గరకు వచ్చేసరికి అతడి కారు పంక్చర్ అయ్యింది. దీంతో.. కారు ఆపి.. టైర్లను పరిశీలిస్తున్న వేళ.. ఒక యువకుడు వచ్చాడు.
మమ్మల్ని కారుతో గుద్ది ఆపకుండా ఎక్కడకు వెళ్తావురా అంటూ తిట్టి కొట్టాడు. తేరుకునే లోపు కత్తితో పొడిచాడు. కాసేపటికి మరో ఇద్దరు యువకులు వచ్చి కర్రలతో కొట్టి వెళ్లారు. అనంతరం వారు ముగ్గురు తిరిగి వచ్చి.. సారీ బ్రదర్ నిన్ను కాదు.. వేరే వాడిని కొట్టాల్సింది.. పొరపాటున నిన్న కొట్టామంటూ వెయ్యి రూపాయిలు చికిత్స కోసం ఉంచుకో అంటూ చెప్పి వెళ్లిపోయారు. దీంతో షాక్ కు గురైన తేజ.. పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అతడ్ని జీజీహెచ్ కు చేర్చించి చికిత్స చేస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ వైనం షాకింగ్ గా మారింది.