ఎప్పుడో 2015లో విడుదలైన సినిమా.. శ్రీమంతుడు. ఎనిమిదన్నర ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ సినిమా ఓ వివాదంతో చర్చల్లో నిలిచింది. ఈ సినిమా కథ తనదే అంటూ శరత్ చంద్ర అనే రచయిత దాని రిలీజ్ టైం నుంచి పోరాడుతున్నాడు. 2012లో తాను రాసి, స్వాతి పుస్తకంలో ప్రచురితం అయిన ‘చచ్చేంత ప్రేమ’ అనే నవలను కాపీ కొట్టి దర్శకుడు కొరటాల శివ ‘శ్రీమంతుడు’ సినిమా తీశాడని ఆయన ఆరోపించడం.. దీనికి సంబంధించిన కాపీ రైట్ కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లి కొరటాల క్రిమినల్ ఛార్జెస్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి రావడం హాట్ టాపిక్‌గా మారింది.
వేరే దారి లేక కొరటాల అండ్ కో శరత్ చంద్రతో సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శరత్ చంద్ర మీడియాతో మాట్లాడాడు. తనకు డబ్బుల కంటే క్రెడిట్ రావడం ముఖ్యమని శరత్ చంద్ర పేర్కొనడం విశేషం. తనకు చాలా ఏళ్ల ముందే రూ.15 లక్షలతో సెటిల్మెంట్ చేయడానికి కొరటాల వైపు నుంచి ప్రయత్నాలు జరిగినట్లు అతను వెల్లడించాడు. ‘‘2012లో నేను రాసిన చచ్చేంత ప్రేమ నవల స్వాతిలో ప్రచురితం అయింది. ఈ కథతో సినిమా చేస్తే బాగుంటుందని దర్శకుడు సముద్రను కలిశాను.
మేం సినిమా మొదలుపెట్టాలనుకుంటున్న సమయంలోనే శ్రీమంతుడు విడుదలైంది. ఆ సినిమా చూసిన మిత్రులు అది నా కథే అన్నారు. నేనూ సినిమా చూశా. నా కథలో ఉన్నది ఉన్నట్లు సినిమాలో చూపించడం చూసి షాకయ్యా. దర్శకుడితో మాట్లాడితే ఇది నా కథ అని ఆయన అంగీకరించలేదు. సినీ పెద్దలు కొందరు అప్పట్లో రాజీ చేయడానికి ప్రయత్నించారు. నాకు 15 లక్షలు ఇప్పిస్తామన్నారు. కానీ రచయితల సంఘం సాయంతో నేను కోర్టును ఆశ్రయించా. ఈ స్క్రిప్టు నాదేనని అంగీకరించాలన్నది నా ప్రధాన ఉద్దేశం’’ అని శరత్ చంద్ర పేర్కొన్నాడు.