ప్రపంచకప్ టీ20 మ్యాచ్ లో దాయాది జట్టు పాకిస్థాన్ చేతిలో భారత జట్టు ఘోర పరాజయం పాలవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ లో భారత్ తో 12 మ్యాచ్ లు ఆడినా ఒక్కసారి కూడా గెలవలేదన్న రికార్డును పాక్ యువ జట్టు బద్దలు కొట్టింది. ప్రపంచ కప్ మ్యాచ్ లలో దాయాది జట్టు భారత్ పై పాక్ తొలి విజయాన్ని అందుకోవడం భారత్ అభిమానులకు మింగుడు పడడం లేదు. అందులోనూ, ఒక్క వికెట్ కూడా పడకుండా 152 పరుగుల లక్ష్యాన్ని పాక్ అవలీలగా ఛేదించడం కొరుకుడుపడడం లేదు.
వరల్డ్ కప్ చరిత్రలో పాక్ పై భారత్ తొలి పరాజయం అత్యంత ఘోరంగా ఉండడం అభిమానులకు రుచించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కీలక మలుపు తిగడానికి అంపైర్ తప్పుడు నిర్ణయమే కారణమని తెలియడంతో వారికి పుండు మీద కారం చల్లినట్లుంది. మటీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అవుటైన బంతి నోబాల్ అని అభిమానులు ఫొటోలు, వీడియోలతో సహా పోస్ట్ చేస్తూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూల్చిన పాక్ బౌలర్ షాహిన్ అఫ్రిది వేసిన మూడో ఓవర్ తొలి బంతికి కేఎల్ రాహుల్ బౌల్డయ్యాడు. కానీ, అది నో బాల్ అని స్పష్టంగా కనిపిస్తున్నా అంపైర్ దానిని చూడలేదని, దీంతో, రాహుల్ పెవిలియన్ కు వెళ్లాల్సి వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. షహీన్ అఫ్రిది గీత దాటి బౌలింగ్ వేసినట్టుగా ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. మరి, ఈ వ్యవహారంపై ఐసీసీ ఏవిధ:గా స్పందిస్తున్నది ఆసక్తకంరగా మారింది.