తెలంగాణకు చెందిన ఆయాన్ష్ అనే చిన్నారి అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతికొద్ది మందికి వచ్చే ఈ అరుదైన వ్యాధితో మూడేళ్ల చిన్నారి చికిత్స పొందుతున్నాడు. అయితే, ఆయాన్ష్ చికిత్సకు కావాల్సిన అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ జోల్గెన్స్మాను కొనేంత స్థోమత అతడి తల్లిదండ్రులకు లేదు. దీంతో, వారు తమ చిన్నారికి సాయం చేయాలని అభ్యర్థించగా…టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆయన భార్య అనుష్క శర్మ, ఇమ్రాన్ హష్మి, దియా మిర్జా, జావీద్ జాఫ్రీ, రాజ్‌కుమార్ రావు, అర్జున్ కపూర్, సారా అలీఖాన్ వంటి ప్రముఖులు విరాళం ఇచ్చారు.
మరికొంత మొత్తం క్రౌడ్ ఫండింగ్ రూపంలో వచ్చింది. సామాన్యులు, సెలబ్రిటీలు అందరూ కలిపి మొత్తం 65 వేల మంది దాతల సహకారంతో మూడున్నర నెలల్లో రూ.16 కోట్లను అయాన్ష్ తల్లిదండ్రులు సేకరించారు. దీంతో, ఆ తల్లిదండ్రులకు అత్యంత విలువైన ఆ ఇంజక్షన్ అమెరికాలోని నోవార్టిస్ నుంచి జూన్ 8 న హైదరాబాద్‌కు చేరింది. ఈ మందు కోసం కేంద్రం దిగుమతి సుంకంతో పాటు జీఎస్టీతో కలిపి రూ. 6 కోట్ల మేరకు మినహాయింపు ఇవ్వడం విశేషం. దీంతో, ఆ చిన్నారి చికిత్సకు మార్గం సుగమమైనట్లుంది.
చత్తీస్‌ఘడ్‌కు చెందిన ఆయాన్ష్ తల్లిదండ్రులు.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. తమ కుమారుడికి అరుదైన వ్యాధి సోకిందని వైద్యులు చెప్పారు. ఆ చిన్నారి అయాన్ష్ వైద్యానికి రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ కావాల్సి వస్తుందని చెప్పారు. అంత ఆర్థిక స్థోమత లేని ఆ తల్లిదండ్రులు… సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించారు. దీంతో, రూ.16 కోట్ల నగదు దాతల ద్వారా సమకూరింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్టుగా వైద్యులు చెబుతున్నారు.