బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోపై సీపీఐ నారాయణ చాలాకాలంగా విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసింది. అది బిగ్ బాస్ హౌస్ కాదని, బ్రోతల్ హౌస్ అని, డబ్బు కోసమే బూతుల స్వర్గం వంటి ఇంటికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని సిపిఐ నారాయణ షాకింగ్ కామెంట్లు చేశారు. గతంలో చాలాసార్లు నారాయణ వ్యాఖ్యలను పట్టించుకోకుండా ఉన్న నాగార్జున పరోక్షంగా ఈ సీజన్లో నారాయణ కామెంట్లపై స్పందించారు.
షోలో భాగంగా భార్యాభర్తలు హగ్ చేసుకోగానే నారాయణ నారాయణ వాళ్లు పెళ్లయిన వాళ్లు అంటూ నారాయణకు నాగ్ కౌంటర్ ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే ఆ కామెంట్లపై సిపిఐ నారాయణ కౌంటర్ ఇచ్చారు. భార్యాభర్తలకు శోభనం గది ఉందని, మరి పెళ్ళి కాని జంటలకు ఏ గది ఉందని వెటకారంగా నాగన్న నాగన్న అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆ నారాయణ నారాయణ కామెంట్లపై నాగార్జున స్పందించారు.
ఎవరైనా జోక్ వేస్తే తాను నారాయణ నారాయణ అంటుంటారని, అది తన అలవాటని నాగ్ చెప్పారు. శనివారం ఎపిసోడ్ లోనూ కంటెస్టెంట్లను నవ్వించడానికి తాను అలా అన్నానని, ఎవరినీ ఉద్దేశించి నారాయణ నారాయణ అనలేదని నాగ్ క్లారిటీ ఇచ్చారు. బిగ్ బాస్ లో ఎవరు డ్రామా ఆడుతున్నారు, ఎవరు గేమ్ ఆడుతున్నారు అని విశ్లేషించుకుంటే తనకు లైఫ్ సైన్సెస్ లా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు.
కుటుంబ సభ్యులను వదిలేసి, వందల కెమెరాల మధ్య, తెలియని వ్యక్తుల మధ్య అన్ని రోజులు గడపడం అనేది చిన్న విషయం కాదని అన్నారు. తాను హోస్ట్ గా మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టదలుచుకున్నానని, పార్టిసిపెంట్ గా, కంటెస్టెంట్ గా మాత్రం తానుు ఆ హౌస్ లోకి వెళ్లాలను కోవడంలేదని నాగ్ చెప్పుకొచ్చారు. మరి, తాజాగా నాగార్జున వ్యాఖ్యలపై నారాయణ స్పందిస్తారా లేక నాగ్ ఇచ్చిన క్లారిటీతో సంతృప్తి చెంది సైలెంట్ అవుతారా అన్నది వేచి చూడాలి.