రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు కొంతకాలంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు జగనన్న సురక్ష కార్యక్రమాల కోసం ప్రజల గడప తొక్కుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు జనం షాక్ ఇస్తున్నారు. ఈ నాలుగేళ్లలో ఏం చేశారు అని జనం నిలదీస్తున్నారు. దీంతో ప్రజలకు సమాధానం చెప్పలేక, తాము చేసిందేమీ లేక వైసీపీ నేతలు మెల్లగా అక్కడ నుంచి జారుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ కు చేదు అనుభవం ఎదురైంది. అనకాపల్లి మండలం కొత్త తలారివారిపాలెంలో గుడివాడ అమర్నాథ్ కు మహిళల నుంచి నిరసన ఎదురైంది. కాలువ నిర్మాణ పనుల శంకుస్థాపన చేసేందుకు వచ్చిన అమర్నాథ్ ను మహిళలు నిలదీశారు. శిలాఫలకం ఆవిష్కరిస్తున్న సందర్భంగా మంత్రిపై పలువురు మహిళలు ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రి దగ్గరకు కొందరు మహిళలు దూసుకుపోయేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.
రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లకు ఊరు గుర్తుకొచ్చిందా అని అమర్నాథ్ ను ఓ మహిళ నిలదీసింది. మళ్లీ ఎన్నికలు సమీపించడంతో ఓట్ల కోసమే ఇక్కడికి వచ్చారని, ఎన్నికల సమయంలో జనాలు గుర్తుకొస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అమర్నాథ్ అక్కడ నుంచి జారుకున్నారు. మరోవైపు, ఈ శిలాఫలకం ఆవిష్కరించిన కొద్ది గంటల్లోనే గుర్తు తెలియని వ్యక్తులు దానిని ధ్వంసం చేయడం హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ జయంతి నాడే ఇటువంటి ఘటన జరగడంతో మంత్రి అమర్నాథ్ కు చేదు అనుభవం ఎదురైనట్లయింది.