వైసీపీ ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల అయితే.. ఏకంగా తమ గ్రామాల్లోకిరావొద్దంటూ.. మాజీ మం త్రి నారాయణ స్వామిపై చెప్పులతో గ్రామస్తులు దాడులు చేసిన విషయం ఇటీవల కాలంలో సంచలనంగా మారింది. తాజాగా.. కృష్ణా జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్కు నిరసన సెగ తగిలింది.
అయ్యా.. సారూ..మేము ఇప్పటికి గుర్తొచ్చామా? అంటూ.. మహిళలు ఆయనను చుట్టుముట్టారు. తమ ప్రాంతానికి రోడ్లు వేయాలని నాలుగేళ్లుగా మొర పెట్టుకుంటున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని సురసానిపల్లె హరిజన వాడ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మొవ్వ మండల పర్యటనకు అనిల్ కుమార్ వస్తున్నారనే సమాచారం తెసుసుకున్న మహిళలు ట్రాక్టర్లలో పెద్ద ఎత్తున మొవ్వ చేరకున్నారు. ఎమ్మెల్యే కారును నడిరోడ్డుపై అడ్డుకున్నారు.
గత ఎన్నికల్లో తమ పల్లె మొత్తం వైఎస్సార్సీపీకి ఓట్లు వేసి తప్పు చేశామని, ఈసారి మళ్లీ ఓట్లు అడగటానికి వస్తే.. అప్పుడు చెబుతామని మహిళలు సవాలు విసిరారు. తమ సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదంటూ మహిళలు నడిరోడ్డుపైనే ఎమ్మెల్యేను నిలదీశారు. గెలిచి నాలుగు సంవత్సరాలు దాటుతున్నా తమ గ్రామానికి ఎందుకు రాలేదని, అసలు మేము గుర్తున్నామా అంటూ ప్రశ్నించారు.
గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఇరుగు పొరుగు గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యే, తమ ఊరు ఎందుకు రాలేదంటూ నిలదీయడంతో, ఒకానొక దశలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ మహిళలపై అసహనం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం దండాలు పెట్టి తిరిగిన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తమ గ్రామ సమస్యలు పరిష్కరించేందుకు తీరిక లేకుండా పోయిందని మహిళలు మండిపడ్డారు. దీంతో కైలే.. అనిల్ ఏమీ సమాధానం చెప్పకుండానే వెనుదిరిగారు.