ఈ మధ్య కాలంలో వైసీపీ నేతలకు ఎక్కడకు వెళ్లినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ అంటూ జనం గడప తొక్కుతున్న అధికార పార్టీ నేతలకు అనూహ్యంగా తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదురవుతోంది. జగన్ పాలనపై విసిగి వేసారి ఉన్న జనం….వైసీపీ నేతలు కనిపించగానే ప్రశ్నల వర్షం కురిపిస్తూ నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాకూ నిరసన సెగ తగిలింది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివారికి కూడా అందినట్లు ముద్రించడంపై ఓ మహిళ ముస్తఫాను నిలదీసింది. తమకు ప్రభుత్వ పథకాలు అందకపోయినా తమ పేరుతో రూ.59,600 ఇచ్చినట్లు పుస్తకంలో ముద్రించారని ఆ మహిళ ముస్తఫా ముందు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ డబ్బులు మొత్తం ఎవరు తీసుకున్నారో చెప్పాలంటూ గుంటూరు నెహ్రూనగర్ చేనేత కాలనీకి చెందిన సజ్జ సుబ్రహ్మణ్యేశ్వరి నిలదీయడంతో ఎమ్మెల్యే ముస్తఫా ఖంగుతిన్నారు.
తమకు పొలం లేకపోయినా ఉందంటూ రైతు భరోసా కింద రూ.40,500 ఇచ్చినట్లు పుస్తకంలో ముద్రించారని, అందులో కాసిన మామిడికాయే ఇదేనంటూ ఎమ్మెల్యే ముస్తఫాకు ఓ మామిడికాయను ఆమె అందించడంతో అంతా షాకయ్యారు. అంతేకాదు, జగనన్న వసతి దీవెన కింద రూ.1,600, విద్యాదీవెన రూ.17,500లు, వైఎస్ఆర్ రైతు భరోసా రూ.40,500లతో కలిపి మొత్తంగా రూ.59,600 లబ్ధి చేకూరినట్లు ముద్రించారని ఆమె వెల్లడించడంతో అవాక్కయ్యారు. రేషన్‌కార్డు, విద్యాదీవెన, తన భర్తకు చేనేత పింఛను అన్నీ తీసివేశారని ఆమె వివరించారు.
ఈ విషయంపై సచివాలయ సిబ్బందిని ముస్తఫా ప్రశ్నించారు. దీంతో, ముద్రణలో పొరపాటు జరిగిందని బదులిచ్చారు. వారి తరఫున తాను క్షమాపణలు కోరుతున్నానని బాధితురాలికి ముస్తఫా చెప్పడంతో వ్యవహారం సద్దుమణిగింది. అంతేకాదు, బాధితురాలికి అర్హత ఉన్న పలు పథకాలు అందేలా చూస్తానని ఆయన హామీ ఇవ్వడంతో ఆమె శాంతించింది.