ఏపీలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు ఈరోజు చివరి తేదీ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీలకు చెందిన పలు అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు, చిన్నాచితక పార్టీలకు చెందిన అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అయితే కొన్నిచోట్ల అధికార పార్టీకి చెందిన నేతలు అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరులో విడదల రజనీ అనే మహిళను కొందరు ఎత్తుకెళ్లిన వైనం సంచలనం రేపుతోంది. ఇక, తిరుపతి జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి పులివర్తి నాని నామినేషన్ కార్యక్రమంలో వైసీపీ నేతలు రచ్చ రచ్చ చేశారు.
నామినేషన్ వేసేందుకు వెళుతున్న తనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారని సంచలన ఆరోపణ చేశారు. తాను వెళుతున్న రోడ్డు బ్లాక్ చేశారని, దాంతో నడుచుకుని వెళ్లి నామినేషన్ వేయాల్సిన పరిస్థితి వచ్చిందని నాని వాపోయారు. అయితే, వైసీపీ కార్యకర్తలు ఎంత బెదిరించినా భయపడకుండా కార్యకర్తలంతా గట్టిగా పని చేయాలని నాాని పిలుపునిచ్చారు. వైసీపీ వాళ్లు రాళ్లు రువ్వితే తమ వాళ్ళని పోలీసులు తీసుకువెళ్లారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాస్కర్ రెడ్డికి భయపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్తారని నాని హెచ్చరించారు.
కాగా, గుంటూరు వెస్ట్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసేందుకు విడదల రజని (మంత్రి కాదు) అనే మహిళ ప్రయత్నించారు. కానీ, ఆమెను నామినేషన్ దాఖలు చేయనివ్వకుండా కొందరు వ్యక్తులు అపహరించారని అను రాఘవరావు అనే వ్యక్తి నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైసీపీ నేతలు, పోలీసుల సాక్షిగా విడదల రజని అనే మహిళను ఎత్తు కెళ్లారని లాయర్ శోభారాణి ఆరోపించారు.