రీల్స్ … ఏదో ఒకటి చేయాలి. రోటీన్ కు భిన్నంగా ఉండాలి. పది సెకన్ల విన్యాసంతో అప్పటివరకు రాని పేరును సొంతం చేసుకోవాలి. లక్షలాది వ్యూస్.. వేలాది పొగడ్తలైనా.. తిట్లు అయినా సొంతం చేసుకోవాలి. మొత్తంగా రాత్రికి రాత్రి పాపులార్టీ వచ్చేలా చేసుకోవాలన్న అతితో చేస్తున్న విన్యాసాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు ప్రమాదాల బారినపడుతున్నారు. తాజాగా ఆ కోవకు చెందిన పిచ్చపనిని చేసిన ఒక యువతిని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
ఇంతకీ ఈ అమ్మడు చేసిన ఎదవ పనేమిటంటే.. ఇన్ స్టాలో తన చిట్టి వీడియో పాపులార్టీ కోసం.. ఎయిర్ పోర్టులో లగేజ్ కన్వేయర్ బెల్ట్ తెలుసు కదా. అందులో పడుకొని రీల్స్ చేసింది. సదరు యువతి చేసిన పనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆఖరికి ఎయిర్ పోర్టును కూడా వదలరా? అంటూ తిట్టేస్తున్నారు. సుజాతా దహల్ అనే మహిళ ఎయిర్ పోర్టులో తాజాగా రికార్డు చేసిన వీడియో వైరల్ గా మారింది.
కదులుతున్న లగేజీ కన్వేయర్ బెల్ట్ మీద ఆమె పడుకోవటం.. తర్వాత లేచి.. వయ్యారంగా తన విన్యాసాన్ని పూర్తి చేస్తుంది. ఇన్ స్టాలో పోస్టుచేసిన కొద్దిసేపటికే ఈ వీడియో పాపులర్ గా మారింది. అయితే.. సుజాతా చేసిన పనిని పలువురు తిట్టిపోస్తున్నారు. నెగిటివ్ వ్యాఖ్యలతో హోరెత్తుతోంది. ఆమెపై చర్యలకు డిమాండ్లు పెరుగుతున్నాయి.
ఎయిర్ పోర్టునైనా వదలొచ్చు కదా? అంటూ ఒక వ్యక్తి కామెంట్ చేస్తే.. ఇలాంటి పనులు చేసే వారికి రూ.లక్షల్లో ఫైన్ వేయాలని మరొకరు మండిపడ్డారు. తనకు తెలిసిన ఒక వ్యక్తి ఇలాంటి పనే చేసి వేళ్లు పోగొట్టుకున్నట్లుగా ఇంకొక నెటిజన్ కామెంట్ రూపంలో తెలియజేశారు. ఈ సందర్భంగా వచ్చిన సందేశాల్లో కొన్ని నిజమే కదా? అన్నట్లుగా ఉన్నాయి. అలాంటిదే ఒకటి చూస్తే.. ‘‘పొరపాటున మీ జుట్టు ఆ బెల్ట్ లో ఇరుక్కుపోతే పరిస్థితేంటి? ఆలోచించావా?’ అంటూ చేసిన కామెంట్ నిజమే కదా? అన్న భావన కలిగేలా చేస్తుంది.
నెట్టింట హడావుడి చేస్తున్న ఈ చిట్టి వీడియోకు ఇప్పటివరకు 23.6 మిలియన్ల వ్యూస్ రావటం గమనార్హం. అయితే.. నెగిటివ్ వ్యూస్ రావటం.. చర్యలకు పట్టుబుడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్న వేళ.. ఏవియేషన్ ఉన్నతాధికారులు స్పందించటం ఖాయమంటున్నారు. అదే జరిగితే.. సదరు మహిళకు షాక్ తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
https://www.instagram.com/reel/C5I_-SfSL4Z/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==