ఏపీలో పీఆర్సీ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రుల కమిటీ హెచ్ఆర్ఏ శ్లాబులకు సంబంధించి ఉద్యోగుల ముందు కొత్త ప్రతిపాదనలు ఉంచింది. దానిపై ఆలోచించుకొని తమకు ఏ విషయం చెప్పాలని సూచించింది. దీంతో, మరోసారి ఉద్యోగులు, సజ్జల నేతృత్వంలోని మంత్రుల బృందం మధ్య చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. సమావేశం తర్వాత సజ్జల బయటకు వస్తున్న సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది.
సజ్జల మీడియాతో మాట్లాడేందుకు వస్తున్న సందర్భంగా కొందరు మహిళా ఉద్యోగులు ఆయన కాళ్లపై పడ్డారు. తమకు న్యాయం చేయలంటూ సజ్జల కాళ్లపై మహిళా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పడ్డారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కార్పొరేషన్లో చేర్చామని సజ్జల వారికి చెప్పారు. అయితే, దానివల్ల ఒకటో తేదీన జీతం రావడం తప్ప తమపకు వేరే న్యాయం జరగలేదని వారు వాపోయారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో, సెక్రటేరియట్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనంపై సజ్జల ఆరా తీశారు.
అంతకుముందు, ప్రభుత్వం తరఫున కొత్త ప్రతిపాదనలను ఉద్యోగుల ముందుంచారు. ఫిట్ మెంట్ మాత్రం 23 శాతం మాత్రమే ఇస్తామని తేల్చి చెప్పింది. ఐఆర్ రికవరీ చేయబోమని చెప్పింది. ఐదేళ్లకు ఓసారి పీఆర్సీ అమలుకు మంత్రుల కమిటీ ఓకే చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ తర్వాతే కొత్త పీఆర్సీ వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పెండింగ్ అంశాలను అభ్యంతరాల కమిటీకి పంపాలని మంత్రుల బృందం నిర్ణయించింది.