దళితబంధుకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. దళితబంధు ఆపేయాలని సీఈసీకి ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో వెంటనే నిలిపివేయాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఓటర్లు ప్రలోభానికి లోను కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈసీ పేర్కొంది. ఉపఎన్నిక తర్వాత దళితబంధును యథావిథిగా కొనసాగించవచ్చని ప్రకటించింది. ఓటర్లను మభ్యపెట్టేందుకు దళితబంధు పథకాన్ని తెచ్చారని సీఈసీ దృష్టికి కొందరు తీసుకెళ్లినట్లు సమాచారం.
ఈ ఫిర్యాదుల ఆధారంగా దళితబంధును నిలిపివేశారు. అయితే ఎవరు ఫిర్యాదు చేశారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఫిర్యాదుదారుల వివరాలను ఎన్నికల సంఘం గోప్యంగా ఉంచింది.
దళిత సాధికారత పథకానికి తెలంగాణ దళిత బంధు పథకాన్ని తెచ్చామని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ పథకం కింద అర్హులైన దళితులకు రూ.10 లక్షలు అందిస్తున్నారు. ఇప్పటికే హుజూరాబాద్, వాసాలమర్రిలో అర్హులైన దళిత కుటుంబాలకు దళితబంధు నిధులను విడుదల చేశారు. మూడు విడతల్లో ఈ డబ్బులను వారి ఖాతాల్లోకి జమ చేశారు.
ఈ రోజు టీఆర్ఎస్లో మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బలహీన వర్గాలను బలోపేతం చేయడానికే దళిత బంధు పథకాన్ని తెచ్చామని తెలిపారు.
దళిత బంధు, దళితులతోనే ఆగిపోదని, బీసీ, ఇతర వర్గాలకు కూడా వర్తింపజేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే దళిత వ్యతిరేకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్లో టీఆర్ఎస్ గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు.
ఎన్నికల అనంతరం దళితబంధును యథావిథిగా కొనసాగించవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. ఇలాంటి సమయంలో దళిత బంధు ఆగిపోతే ఎన్నికలయిన తర్వాత ఇస్తారా? అనే అనుమానాలు లబ్ధిదారులను వెంటాడుతున్నాయి. గతంలో హైదరాబాద్లో వరద సాయం కూడా ఇలా మధ్యలో నిలిపివేసి ఎన్నికలవగానే ఇవ్వలేదనే విమర్శలు వచ్చాయి.
ఇదే అంశాన్ని విపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఎవరు ఫిర్యాదు చేశారో తేలే వరకు రాజకీయ విమర్శలు కొనసాగుతాయి. ఇప్పటికే ఈటల పేరుతో అనేక ఫేక్ లేఖలు బయటకు వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అలాంటివి అన్ని వైపుల నుంచి దూసుకొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.