ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబుకు పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. చంద్రబాబు, పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన చిరంజీవి తాజాగా ‘ఎక్స్'(ట్విట్టర్ ) ద్వారా చంద్రబాబుకు కంగ్రాట్స్ చెప్పారు. పనిలో పనిగా చిరు తన తమ్ముడు డిప్యూటీ సీఎం అని లీక్ కూడా ఇచ్చేశారు.
“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబునాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.. ఆశిస్తున్నాను.!!” అని చిరు ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు అంటూ ఆనంద్ మహీంద్రా తెలుగులో ట్వీట్ చేశారు. ధన్యవాదాలు ఆనంద్ మహీంద్రా గారూ… మీ వంటి పారిశ్రామిక దిగ్గజాల శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి బాటలు వేయగలవని ఆశిస్తున్నాను అంటూ చంద్రబాబు రీట్వీట్ చేశారు.
చంద్రబాబుకు హైదరాబాద్ లో అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి తాను కూడా హాజరయ్యానని, అది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. చంద్రబాబు డైనమిక్ నాయకత్వంలో మాత్రమే ఏపీకి సంబంధించి అమెరికా-భారత్ సంబంధాలు బలోపేతం అవుతాయని గట్టిగా నమ్ముతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాదులో బ్రిటీష్ కాన్సుల్ జనరల్ గారెత్ విన్ ఓవెన్ ఏపీ నూతన సీఎం చంద్రబాబుకు, మంత్రి పవన్ కల్యాణ్ కు, ఇతర ఏపీ మంత్రివర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆల్ ది బెస్ట్ పెదనాన్న అంటూ చంద్రబాబుకు ఓ లేఖ రాసి సోషల్ మీడియాలో హీరో నారా రోహిత్ విషెస్ చెప్పారు. “పెదనాన్న… గత నాలుగున్నర దశాబ్దాలుగా మీరు రాజకీయాలలో ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకులను చూశారు… తట్టుకున్నారు… ఆత్మవిశ్వాసంతో నిలబడ్డారు. కానీ గత ఐదేళ్ల కాలంలో ఎంతో వేదన అనుభవించారు. అయినప్పటికీ పార్టీని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మీకు కష్టం వచ్చినప్పుడు వాళ్లందరూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మీ కోసం నిలబడ్డారు. అప్పుడు తెలిసింది… గత 40 ఏళ్ల మీ కష్టానికి మీరు పొందింది ప్రజల గుండెల్లో కదిలించలేని స్థానం’’ అని రోహిత్ లేఖ రాశారు.
“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు. చారిత్రాత్మకమైన మెజారిటీతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజల ఆశయాలకు, నమ్మకాలకు అనుగుణంగా మీ పాలన సాగాలి. సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతలను కాపాడాలి. గత అయిదేళ్లలో నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. కఠిన సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నాను. పవన్ కల్యాణ్ సహా మంత్రులందరికీ శుభాకాంక్షలు” అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఓ లేఖ రాశారు.
కేంద్రమంత్రులు ఎస్.జైశంకర్, కిషన్ రెడ్డి, టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు భవిష్యత్ దార్శనిక విధానాలతో తరతరాల వారికి స్ఫూర్తిగా ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తారు అని దేవిశ్రీ ప్రసాద్ కొనియాడారు.