ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అండ్ బ్యాచ్ అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేడంపై పెద్ద ఎత్తున్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటూ జగన్ మొండి పట్టుపై కూర్చున్నారు. మామూలు ఎమ్మెల్యేకిచ్చినట్లు 2 నిమిషాలు మైక్ ఇస్తే సభలో ఏం ప్రస్తావించగలమంటూ వితండ వాదం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడే అవకాశాన్ని మూర్ఖత్వంతో దూరం చేసుకుంటున్నారు. జగన్ తీరు పట్ల అధికార పక్షాలు, ప్రజలే కాకుండా సొంత పార్టీ నేతలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇలాంటి సమయంలో జగన్ కు అసెంబ్లీకి వెళ్లేందుకు మంచి ఛాన్స్ వచ్చింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో సీఎం చంద్రబాబు అసెంబ్లీలో బటయపెట్టారు. ఏపీ మొత్తం అప్పు రూ.9,74,556 కోట్లుగా ఉందని ఆయన తెలిపారు. ఇది కాదని ఎవరైనా అంటే, అసెంబ్లీకి రండి.. లెక్కలు తేల్చుదాం అని చంద్రబాబు సవాల్ విసిరారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఆర్థిక ఉగ్రవాదాన్ని సృష్టించిందని.. ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు తెచ్చిందని మండిపడ్డారు.
అయితే జగన్ వాదన మాత్రం మరో విధంగా ఉంది. తమ హాయంలో చేసిన అప్పులపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మీడియా ముఖంగా జగన్ బలంగా వాదిస్తున్నారు. 2019లో తాము అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రం అప్పులు రూ.3.13 లక్షల కోట్లు ఉండగా.. 2024లో తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి అప్పులు రూ.6.46 లక్షల కోట్లని జగన్ అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అప్పులు 19 శాతం పెరిగితే.. తమ ప్రభుత్వంలో 15 శాతమే పెరిగిందని మాజీ సీఎం చెబుతున్నారు.
కానీ చంద్రబాబు పది లక్షల కోట్ల అప్పులకు వివరంగా లెక్కలు చెప్పారు. కాదు ఇంకా తక్కువ ఉన్నాయంటే అసెంబ్లీకి రండి తెల్చుకుందామని సవాల్ విసిరారు. కాబట్టి అప్పులు తక్కువ అని గట్టిగా చెబుతున్న జగన్.. దాన్ని నిరూపించుకోవడానికి అసెంబ్లీకి వస్తారా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జగన్ అసెంబ్లీకి హాజరైతే కచ్చితంగా మైక్ ఇస్తారు. అప్పుల వివరాలపై మాట్లాడాలనుకుంటే ఎంత సైపు అయినా ఆయన మాట్లాడొచ్చు. నిజంగా తన హయాంలో ఎక్కువ అప్పులు చేసుండకపోతే తన గళం విప్పడానికి జగన్ కు ఇది అద్భుత అవకాశం అవుతుంది.