ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. 5 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ ప్రసంగంతో సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు స్టార్ట్ అవుతాయి. ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈనెల 23న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కూటమి సర్కార్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశ పెట్టబోతోంది.
అలాగే వైకాపా ప్రభుత్వ పాలనపై ఇప్పటికే నాలుగు స్వేత పత్రాలను విడుదల చేసిన సీఎం చంద్రబాబు.. మద్యం, శాంతి భద్రతలు, ఆర్థిక శాఖలకు సంబంధించిన మరో మూడు శ్వేత పత్రాలను సభలో విడుదల చేసి చర్చించనున్నారు. ఇక ఇదే తరుణంలో అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడానికి జగన్ ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ నయా ప్లాన్ సిద్ధం చేశారని ప్రచారం జరుగుతుంది.
ఇటీవల వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో శాంతి, భద్రతలు క్షీణించాయని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి దారుణాలు జరుగుతూనే ఉన్నాయని జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీలో 24న వైసీపీ ధర్నా చేస్తుందని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని తమ ఎమ్మెల్యేలు అడ్డుకుంటారని కూడా జగన్ పేర్కొన్నారు. దీంతో ఆయన ప్లాన్ పై ఒక స్పష్టత వచ్చినట్లైంది.
సోమవారం జరగబోయే అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సభకు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు జగన్ హాజరవుతారు. అయితే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని అడ్డుకుని గందరగోళం సృష్టించి.. సభాసమయాన్ని వృధా చేయాలనే ఆలోచనలో వైసీపీ నేతలు ఉన్నారట. ఈ సందర్భంగా స్పీకర్ సస్పెండ్ చేస్తే సభను వదిలి వెళ్లిపోవాలనేది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. ఇక మంగళవారం తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లేందుకు జగన్ ప్లాన్ చేసుకున్నారు. ఢిల్లీలో ధర్నా, నిరసనల పేరుతో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని జగన్ నిర్ణయించారనే ప్రచారం జోరుగా సాగుతోంది.