వివేకా హత్య కేసు నేపథ్యంలో జగన్ పై ఆయన సోదరి వైఎస్ సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల తర్వాత ఎన్నికలకు ముందు చిన్నాన్న వివేకా గుర్తుకు వచ్చారా అంటూ జగన్ ను సునీత కడిగిపారేసిన వైనం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో జరిగిన ప్రజాగళం సభలో జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. బాబాయ్ ని చంపింది ఎవరు? ముద్దాయి అవినాశ్ రెడ్డిని పక్కన పెట్టుకుని, వైఎస్సార్ సమాధి సాక్షిగా అబద్ధాలు చెప్పింది ఎవరు అంటూ అని జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు.
తనకు న్యాయం చేయాలని ఆడబిడ్డ సునీత ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, జగన్ కు సపోర్ట్ చేస్తారా? సునీతకు సపోర్ట్ చేస్తారా? అని ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు. మా చిన్నాన్నను చంపేశారు అంటూ నిన్న నంగనాచిలా మాట్లాడిన జగన్ మళ్లీ డ్రామా రాయుడు, కరకట్ట కమలహాసన్ అవతారమెత్తాడని ఎద్దేవా చేశారు. బాబాయ్ ని చంపిందెవరో అందరికీ తెలుసని, కానీ జగన్ మాత్రం దేవుడికే తెలుసు అంటున్నారని చురకలంటించారు. సునీత వేసిన ప్రశ్నలకు జగన్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి నేరాలు ఘోరాలు చేసి, మళ్లీ ఆ నేరాలను మనపై నెట్టాలనుకుంటున్నాడు జగన్ అని మండిపడ్డారు. హత్యా రాజకీయాలపై ప్రజలకు ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని, ఎవరు హత్య చేసినా శిక్షించాలని… దానికి మీరు సిద్ధమా అని జగన్ కు సవాల్ విసిరారు.