కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధమని షర్మిల ప్రకటించారు. రేపు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలవబోతున్నానని, ఆ తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు నష్టం కలగకూడదనే పోటీ నుంచి తప్పుకున్నానని, లేదంటే కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్తితులు ఎదురయ్యేవని అన్నారు. అది గుర్తించిన కాంగ్రెస్ తనను పార్టీలో చేరాలని ఆహ్వానించిందని అన్నారు. త్వరలో తన కుమారుడి పెళ్లి జరగబోతోందని, అందరి ఆశీర్వాదం కావాలని షర్మిల అన్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక, తన పార్టీ నేతలతో షర్మిల సమావేశమై కాంగ్రెస్ లో పార్టీ విలీనం ఖాయమని వారితో చెప్పినట్లు తెలుస్తోంది. షర్మిలకు ఏపీసీసీ చీఫ్ పదవి లేదా ఏఐసీసీ, సీడబ్ల్యూసీలో కీలక దక్కనుందని తెలుస్తోంది. షర్మిలతోపాటు 40 మంది నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని తెలుస్తోంది.
ఇడుపులపాయలో తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి ముందు ఉంచిన అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. షర్మిల మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా కాబోయే దంపతులు వైఎస్ రాజారెడ్డి, ప్రియా అట్లూరి కూడా షర్మిల వెంట ఉన్నారు.