మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించి ముందు ఉన్న అంచనాలను తలకిందులు చేస్తూ.. ప్రకాష్ రాజ్ మీద మంచి ఆధిక్యంతో అధ్యక్షుడిగా గెలుపొందాడు మంచు విష్ణు. సినిమాల్లో ఆశించిన మేర విజయం సాధించలేక, మార్కెట్ బాగా తినేసి నామమాత్రంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విష్ణు.. ‘మా’ ఎన్నికల్లో గెలవడాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు.
చివరికి అనుకున్నది సాధించాడు. దీని పట్ల అతనెంత సంతోషంగా, ఉద్వేగంగా ఉన్నాడో గత రెండు రోజులుగా అందరూ చూస్తూనే ఉన్నారు. అందులోనూ ఫలితాలు వెల్లడయ్యాక, మరుసటి రోజు పెట్టిన ప్రెస్ మీట్లో విష్ణు కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు. ఇన్నేళ్ల కెరీర్లో విష్ణు అంత జోష్తో ఎప్పుడూ కనిపించలేదనే చెప్పాలి.
ఐతే ఎన్నికల్లో గెలిచాడు కాబట్టి అంతా బాగుంది అనుకోవడానికి మాత్రం లేదు. విష్ణుకు ముందుంది ముసళ్ల పండుగ అని ఇండస్ట్రీ జనాలు అంటున్నారిప్పుడు. విష్ణు అధ్యక్షుడయ్యాడో లేదో అతడికి సవాళ్లు మొదలైపోయాయి. ‘మా’లో ప్రాంతీయ వాదం ఎక్కువైపోయిందంటూ నాగబాబు, ప్రకాష్ రాజ్, శివారెడ్డి లాంటి వాళ్లు ఒకరి తర్వాత ఒకరు ‘మా’కు రాజీనామా చేసేశారు.
ముఖ్యంగా నాగబాబు, ప్రకాష్ రాజ్.. విష్ణు అండ్ కో మీద పరోక్షంగా గట్టి ఆరోపణలే చేశారు. ఎన్నికల ముందు మాదిరి విష్ణు వారిపై ఎదురు దాడి చేయలేడు. తెలివిగా నరుక్కు రావాలి. వాళ్లను సముదాయించాలి. ఈ రాజీనామాల పర్వానికి తెరదించకపోతే.. ‘మెగా’ క్యాంపుకి చెందిన మరింత మంది ఈ బాట పట్టొచ్చు. అప్పుడు సగం కార్యవర్గం ఖాళీ అయిపోతుంది.
మున్ముందు ‘మా’ కార్యకలాపాలకు మెగా క్యాంపంతా దూరం కావచ్చు. దీని వల్ల ముసలం పుట్టి ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోవడం ఖాయం. అప్పుడు విష్ణు సాధించిన విజయానికి విలువ లేకుండా పోవచ్చు. మరి ఈ వ్యవహారాన్ని విష్ణు ఎలా సర్దుబాటు చేస్తాడన్నది చూడాలి.
అలాగే చిరంజీవి అండ్ కోతో విష్ణు ఎలా వ్యవహరిస్తాడన్నది కూడా కీలకమే. చిరును కాదని, ఆయన్ని ధిక్కరించి విష్ణు ముందుకెళ్తే కష్టమే. ఇంకోవైపు గత కార్యవర్గంలో నరేష్, జీవితల మధ్య తలెత్తిన గొడవలతో ‘మా’ ప్రతిష్ఠ ఎంతగా దెబ్బ తిందో తెలిసిందే. అప్పుడు చిరంజీవే ముందుకొచ్చి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు.
ఇప్పుడు చిరు మద్దతిచ్చిన ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో చిరంజీవి ‘మా’ వ్యవహారాల్లో ఏమేర జోక్యం చేసుకుంటాడన్నది సందేహమే. ఒకవేళ ఇప్పుడు ‘మా’లో అంతర్గత కుమ్ములాటలు తలెత్తితే పరిస్థితి ఏంటో చూడాలి.
ఇవన్నీ పక్కన పెడితే.. అధ్యక్షుడిగా గెలవడం కోసం విష్ణు చాలా పెద్ద పెద్ద హామీలే ఇచ్చాడు. ‘మా’ భవన నిర్మాణం సహా చాలా హామీలే నెరవేర్చాల్సి ఉంది. ఇవన్నీ పూర్తి చేసి ‘మా’ సభ్యులను ఏమేర సంతృప్తి పరుస్తాడు.. అధ్యక్షుడిగా ఎంత వరకు విజయవంతం అవుతాడన్నది చూడాలి.