‘నాకు రూ.2.50 కోట్లు ఇస్తే ఈవీఎం లో చిప్ లు మార్చేస్తా. మీరు చెప్పిన అభ్యర్థిని గెలిపిస్తా’ అని ప్రతిపాదన తీసుకొచ్చిన ఓ ఆర్మీ జవాన్ పోలీసుల చేతిలో పడి కటకటాల పాలయ్యాడు.
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ లో శాసనమండలిలో ప్రతిపక్ష నేత అంబాదాస్ దన్వేను సైన్యంలో జవాన్ గా పనిచేస్తున్న మారుతి ధక్నే కలిశాడు. రూ.2.50 కోట్లు ఇస్తే మీరు చెప్పిన అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చేలా ఈవీఎంలో చిప్ మారుస్తానని అన్నాడు.
అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలనుకున్న అంబదాస్ ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మంగళవారం సాయంత్రం అంబాదాస్ సోదరుడు రాజేంద్ర నిందితుడిని ఒక హోటల్‌కు పిలిపించి బేరమాడి రూ.2.50 కోట్లకు బదులు రూ. 1.50 కోట్లకు డీల్ చేసుకున్నట్లు నమ్మించి రూ.లక్ష అడ్వాన్స్ ఇచ్చారు. ఆ వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి మారుతిని అరెస్ట్ చేశారు. పెద్ద మొత్తంలో అప్పుల్లో కూరుకుపోయిన మారుతి ఇలా పెడదారి పట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన మారుతి ధక్నే జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్ ప్రాంతంలో ఆర్మీబేస్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం.