తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా బహిరంగ సభలో సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. టీడీపీ-జనసేన కూటమి విన్నింగ్ టీమ్ అని, వైసీపీ ఒక చీటింగ్ టీమ్ అని ధ్వజమెత్తారు. అగ్నికి వాయువు తోడైనట్లుగా, టిడిపికి పవన్ కళ్యాణ్ తోడయ్యారని, వైసీపీ బుగ్గి కావడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడేందుకే టీడీపీ-జనసేన కూటమి ఏర్పడిందని, ఇది పవన్ కళ్యాణ్ కోసమో, చంద్రబాబు కోసమో, ఇద్దరి అధికారం కోసమో ఏర్పడలేదని చంద్రబాబు క్లారిటీనిచ్చారు.
అందుకే, ఈ కూటమితో కలిసి ప్రజలు ముందుకు రావాలని, ఈ కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. టీడీపీ-జనసేన పొత్తు సూపర్ హిట్ అని, జగన్ ఐదేళ్ల బాహుబలి సినిమా అట్టర్ ప్లాప్, అని దానికి సీక్వెల్ లేదని సెటైర్లు వేశారు. తాడేపల్లిగూడెం సభ చూసి తాడేపల్లి ప్యాలెస్ కంపించిందని, ఈ సభ కూటమి విజయానికి నాంది పలికిందని చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తి అహంకారం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ప్రజా నేతగా ఈ విధ్వంసకర పాలనను తాను చూస్తూ ఊరుకోలేనని చెప్పారు.
అదేవిధంగా అన్యాయాన్ని ప్రశ్నించే, ఎదిరించే తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఇటువంటి అరాచకాలను చూస్తూ మౌనంగా ఉండబోరని అన్నారు. ఆ క్రమంలోనే టీడీపీ-జనసేనల మధ్య పొత్తు పొడిచిందని, ఇది ప్రజల కోసం ప్రజలు కుదుర్చుకున్న పొత్తు అని చంద్రబాబు చెప్పారు. చీకట్లు నిండిన జగన్ పాలనను పారద్రోలి రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఈ పొత్తు అని స్పష్టం చేశారు.