పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం ఘటన పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీపీ భర్త స్వయంగా ఈ దాడిలో పాల్గొన్నారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. దీంతో, ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బాలకోటిరెడ్డిపై వైసీపీ రౌడీల హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. ఏపీలో శాంతిభద్రతలు లేవనేందుకు ఈ ఘటనే నిదర్శమన్నారు. పోలీసు, రక్షణ వ్యవస్థలు నిద్రపోతున్నాయా? అని ప్రశ్నించారు.
జగన్ ప్రోత్సాహంతోనే టీడీపీ నేతలు, కార్యకర్తల హత్యలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్ ఆదేశాలతోనే పోలీసులు ఈ దాడుల వ్యవహారంలో కల్పించుకోవడం లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. అలా జగన్ ఆదేశాలివ్వకుంటే పోలీసులు ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారని ప్రశ్నించారు. ఈ దాడులకు టీడీపీ ప్రతీకారం తీర్చుకుంటే వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు? జగనా లేక పోలీసులా? అని చంద్రబాబు నిలదీశారు. ప్రాణాలతో పోరాడుతున్న బాలకోటిరెడ్డికి ఏం జరిగినా జగన్ రెడ్డే సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
మరోవైపు, ఈ దాడి ఘటనను టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. ‘హత్యలు, దాడులతో టీడీపీ కేడర్ ను భయపెట్టాలనుకుంటున్న జగన్ గారూ, శిశుపాలుడిలా మీ పాపాలు పండిపోయాయి ప్రజావ్యతిరేకత తీవ్రం కావడంతో రాజకీయ ఆధిపత్యం కోసం మీరు చేయిస్తున్న హత్యలు, దాడులే మీ పతనానికి దారులు’ అని లోకేశ్ అన్నారు. దాడిలో ఏకంగా వైసీపీ ఎంపీపీ భర్త పాల్గొన్నాడంటే మీ రౌడీమూకలు ఎంతగా బరితెగించాయో అర్థమవుతోందని లోకేశ్ ఫైర్ అయ్యారు.
ఫ్యాక్షన్ మనస్తత్వం బ్లడ్ లోనే ఉన్న మీ పాలనలో పల్నాడు ప్రాంతం రక్తసిక్తమవుతోందని, ఇకనైనా హత్యారాజకీయాలు, దాడులను ఆపాలని లోకేశ్ హితవు పలికారు. లేదంటే ఇంతకు నాలుగింతలు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ అధికారం కోల్పోతే వైసీపీ నేతలకు దిక్కెవరని ప్రశ్నించారు.