ఆంధ్రప్రదేశ్ కు విశాఖ రైల్వే జోన్ కేటాయించడం సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిందని ఈరోజు కొన్ని మీడియా ఛానళ్లలో, కొన్ని దినపత్రికలలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించిన కేంద్రం తాజాగా విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ చేతులెత్తేసిందని విమర్శలు వస్తున్నాయి. అయితే, కేంద్రం నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదని కొందరు అంటున్నారు.
ఈ నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ వ్యవహారంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. విశాఖకు రైల్వేజోన్ ఇవ్వకుంటే తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. విశాఖకు రైల్వే జోన్ రాదన్నదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టి పడేశారు. నిన్న కేంద్ర ప్రభుత్వ అధికారులతో జరిగిన చర్చల్లో విశాఖ రైల్వే జోన్ అంశం ప్రస్తావనే రాలేదని అన్నారు.
కేంద్రం కూడా రైల్వే జోన్ ఇచ్చేందుకు సుముఖంగా ఉందని సాయి రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా రైల్వే జోన్ ప్రస్తావన ఉందని చెప్పుకొచ్చారు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చేందుకు కేంద్రం కూడా గతంలో ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. ఏది ఏమైనా విశాఖ రైల్వే జోన్ కోసం రాజీనామా చేస్తానంటూ విజయసాయి చేసిన ప్రకటన నమ్మశక్యంగా లేదని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
ప్రత్యేక హోదా కోసం ఉత్త ప్లకార్డు పోరాటాలు చేసిన విజయసాయిరెడ్డి…కేంద్రం విశాఖ రైల్వే జోన్ ఇవ్వబోమని చేతులెత్తేసినా చేసేదేమీ ఉండదని ట్రోల్ చేస్తున్నారు. లేదంటే, కేంద్రం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై సుముఖంగా ఉండి ఉంటుందని, అందుకే, ఇంత గట్టిగా విజయసాయి రాజీనామా అంటూ డ్రామాలాడుతున్నారని సెటైర్లు వేస్తున్నారు. ఇలా రాజీనామా అంటూ కొంత మైలేజీ కొట్టేసేందుకు సాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారని పంచ్ లు వేస్తున్నారు.