ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కొన్ని ప్రాంతాల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ డిమాండ్ కు మద్దతుగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు మౌన దీక్షకు దిగారు. హిందూపురంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేసిన తర్వాత అంబేద్కర్ విగ్రహం వద్దే బాలకృష్ణ మౌన దీక్షకు దిగారు.
బాలయ్య దీక్షలో పాల్గొనేందుకు విద్యార్థులు, ప్రజా సంఘాలు భారీగా తరలిరావడంతో హిందూపురంలో హై టెన్షన్ ఏర్పడింది. జై బాలయ్య…జై జై బాలయ్య అంటూ యువకులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దీక్షలో కూర్చోవడానికి ముందు బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే.. తాను రాజీనామా చేస్తానని.. వైసీపీ ప్రజా ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడానికి సిద్దమేనా అంటూ బాలయ్య సవాల్ విసిరారు.
హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాల్సిందేనని ప్రభుత్వాన్ని బాలయ్య డిమాండ్ చేశారు. మౌన దీక్ష తర్వాత బాలకృష్ణ సాయంత్రం అఖిలపక్ష నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొననున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్‌తో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. బాలయ్య దీక్షతో హిందూపురం ప్రజల్లో జోష్ వచ్చింది.