టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన తనయుడు రాజేష్ ల అరెస్టు వ్యవహారం ఆంధ్రా రాజకీయాల్లో పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. నిన్న తెల్లవారుజామున హఠాత్తుగా అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ దూకి మరీ ఏపీ సిఐడి అధికారులు తీవ్రవాదిని అరెస్టు చేసినట్టుగా ఆయనను అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. అయ్యన్న, రాజేష్ ల అరెస్టులను టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు ప్రతిపక్ష నేతలంతా తీవ్రంగా ఖండించారు.
ఈ క్రమంలోనే ఏపీ సిఐడి అధికారులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అయ్యన్నతోపాటు రాజేష్ లకు రిమాండ్ విధించాలన్న సిఐడి అధికారుల అభ్యర్థనను విశాఖ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో అయ్యన్నతోపాటు రాజేష్ కు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జగన్ అండ్ కోకు గట్టి షాక్ తగిలినట్లయింది. వీరికి సీఆర్పీసీ 41 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి విచారణ జరుపుకోవాలని కోర్టు ఆదేశించింది.
రెండు సెంట్ల భూమిని ఆక్రమణకు గురిచేసి అయ్యన్న ఆయన ఇద్దరు కుమారులు నకిలీ పత్రాలను సృష్టించారని వీరిపై కేసు నమోదైంది. ఈ కేసును పరిశీలించిన న్యాయమూర్తి వారిపై మోపిన ఐపిసి సెక్షన్ వారికి వర్తించదని తేల్చి చెప్పారు. ఇక, తనకు బెయిల్ మంజూరు అయిన తర్వాత జగన్ పై అయ్యన్న నిప్పులు చెరిగారు. తనపై 14 కేసులు పెట్టించారని, అయినా తాను భయపడేది లేదని ఆయన చెప్పారు.
జగన్ ప్రభుత్వం వైఫల్యాలను, లోపాలను ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. తాను జగన్ కు శత్రువుని కాదని, కేవలం రాజకీయ ప్రత్యర్థిని మాత్రమేనని జగన్ గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రతిపక్ష నేతలపై జగన్ కు అంత కక్ష ఏమిటని, చివరకు తన మనవరాలిని కూడా విచారణ పేరుతో వదలడం లేదని సంచలన ఆరోపణలు చేశారు.