వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం సంచలన రేపిన సంగతి తెలిసిందిే. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా తప్పదని ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది. ఈనేపథ్యంలోనే తనను అరెస్టు చేయవద్దు అంటూ ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును అవినాష్ రెడ్డి ఆశ్రయించారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ విచారణ ఉందని, ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ పూర్తయిన తర్వాతే తాను సిబిఐ విచారణకు హాజరయ్యేలాగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరటనిచ్చింది. రేపు ఉదయం 10:30 గంటలకు అవినాష్ రెడ్డిని విచారణ చేయాలని సీబీఐ అధికారులకు తెలియజేసింది. ఈ క్రమంలోనే వివేకాపై అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సునీల్ యాదవ్ తల్లితోపాటు, ఉమా శంకర్ రెడ్డి భార్యతో వివేకాకు సంబంధాలున్నాయంటూ బెయిల్ పిటిషన్ లో ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
సీఆర్పీసీ 160 కింద తనకు నోటీసులు జారీ చేసి సీబీఐ అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారని చెప్పారు. డబ్బులిచ్చి దస్తగిరిని అప్రూవర్ గా మార్చుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే సీబీఐ విచారణ వాయిదా పడడంతో తన అనుచరులతో కలిసి హైదరాబాద్ లో తన నివాసానికి అవినాష్ రెడ్డి వెళ్లిపోయారు. ఇక, అవినాష్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ పై విచారణ తెలంగాణ హైకోర్టులో కొనసాగుతోంది.