మంచో చెడో అన్న విషయాల్ని పక్కన పెట్టేయటం మంచిది. ఎందుకంటే జరగాల్సిన రాష్ట్ర విభజన జరిగింది. ఎవరి వాటా ఏమిటన్న దానిపై నలుగురు చర్చించటం అన్నది లేకుండా.. ఏకాఏకిన తీసుకొచ్చేసి కోట్లాది మంది మీద రుద్దేయటం తెలిసిందే. ఇష్టం లేకున్నా విభజనను అంగీకరించాల్సిన అవసరం ఏపీ ప్రజలకు వచ్చినప్పుడు.. దానికి తగ్గట్లు.. ఒకట్రెండు నెగిటివ్ పాయింట్లు తెలంగాణ ప్రజలు అంగీకరించక తప్పదు.
విభజనతో ఏపీకి జరిగిన నష్టంతో పోలిస్తే.. తెలంగాణకు ఒరిగిన లాభం గురించి తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు. అందుకే.. వారు అనవసరమైన విషయాల్ని పట్టించుకోలేదు. కానీ.. రాజకీయం కోసం ఏదో ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి భావోద్వేగాల్ని రగల్చటం ద్వారా ప్రయోజనం పొందాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు గులాబీ నేతలు. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
ఎప్పుడో అయిపోయిన ఏడు మండలాల్ని ఏపీలో కలిపిన వైనంపై తాజాగా గళం విప్పారు. అప్పుడెప్పుడో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం.. ఏడు మండలాల విషయంలో తన మనసులో ఉన్న ఇబ్బంది ప్రస్తావిస్తూనే.. అయ్యిందేదో అయిపోయింది.. ఇప్పుడు అవునన్నా.. కాదన్నా చేసేదేమీ లేదని తేల్చేశారు.
ఇంత క్లియర్ గా గులాబీ అధినేత చెప్పిన మాటల్ని తలలోకి ఎక్కించుకోకుండా.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తీరుతో అనవసరమైన ఇబ్బందులు ఖాయం. ఏడు మండలాల విషయం మీద నోరు విప్పిన మంత్రి పువ్వాడ అజయ్ కు.. కౌంటర్లు భారీగా పడుతున్నాయి. ఏడు మండలాల మీద మాట్లాడుతున్న పువ్వాడ వ్యాఖ్యలు స్పందిస్తున్న ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు.. ఏడు మండలాలు తీసుకొని.. హైదరాబాద్ ఇచ్చేస్తారా?
అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసరమైన వ్యాఖ్యలు చేయటం తొండి వాదనే అవుతుందని.. అలాంటి వాదనకు సరైన సమాధానంగా హైదరాబాద్ ను ఇచ్చేయాలన్న మాట వస్తుందన్న మాట ఏపీకి చెందిన పలువురి నోట వినిపిస్తోంది. అందుకే.. ఆ మాటల్ని కట్టి పెట్టటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక.. పోలవరం ప్రాజెక్టు కారణంగా భద్రాచలానికి ముప్పు ఉంటుందని ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రస్తావించారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
అలాంటప్పుడు ఐదు మండలాలు తెలంగాణకు ఇవ్వాలంటున్న పువ్వాడ.. ఏపీకి మరేం ఇస్తారో కూడా చెప్పాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు. అందుకే.. జరిగిన విభజన జరిగిపోయిన తర్వాత.. ఇప్పుడు వాటి గురించి ప్రస్తావించటం ద్వారా సాధించేది ఏమీ ఉండదన్న సత్యాన్ని గుర్తించాలంటున్నారు. విడిపోయి కలిసి ఉందామన్న ఉద్యమ నినాదాన్ని పువ్వాడ లాంటి నేతలు గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. అయినా.. ఉద్యమంలో పాల్గొనని పువ్వాడకు ఇలాంటివి గుర్తుండే అవకాశం ఉండదన్న సందేహాలు అక్కర్లేదంటున్నారు.