వచ్చే ఎన్నికల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (దిగ్గజ నేత ఎర్రన్నాయుడు సోదరుడు) ను ఓడిస్తామని జగన్ అంటున్నారు. సాధ్యమేనా.. తెరపైకి కొత్త సమీకరణాలు తీసుకుని వచ్చి, జగన్ సాధించేదేంటి? ముఖ్యంగా అచ్చెన్నను ఓడించే బాధ్యత రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు అప్పగించనున్నారని టాక్. అది సాధ్యమేనా ? అంటే అచ్చెన్న ఓటమి సాధ్యమేనా ? ఆ వివరం ఈ కథనంలో …
నాలుగో సింహం అంటే పోలీసు అని కాదు. నాలుగో సింహం అంటే పబ్లిక్ లోనూ కనిపించే నాలుగో సింహం అని! ఏ విధంగా చూసుకున్నా పబ్లిక్ లో ఉన్నాం కనుక వాడెవ్వడో అన్న విధంగా అనుకోకూడదు కానీ శ్రీకాకుళంలో మరో రూలింగ్ కమ్యూనిటీ రానుంది. ఇప్పటిదాకా కాళింగ, వెలమ, కాపు సామాజికవర్గాలే రూలింగ్ కమ్యూనిటీలుగా ఉన్నాయి. కొద్దో గొప్పో శ్రీకాకుళం మున్సిపాల్టీ వరకూ కళింగ కోమటి ఉన్నా అదేమంత చెప్పుకోదగ్గ ప్రభావం అయితే చేయలేదు. అవన్నీ కుర్చీలకు పరిమితం అయిన పదవులు కనుక వాటిపై పెద్దగా మాట్లాడుకోనవసరం లేదు. ఓ పదేళ్ల చరిత్రలో అంతకుముందు ఉన్న గతం గురించి వాటి గోల గురించి ఇప్పుడెందుకులే కానీ… తాజాగా ఉన్న వివరం అనుసరించి శ్రీకాకుళంలో రూలింగ్ కమ్యూనిటీగా యాదవులు తెరపైకి రానున్నారు. ఇదే ఇప్పుడు ఈ వార్తకు మూలాధారం అవుతోంది.
శ్రీకాకుళం జిల్లాలో యాదవులు ప్రభావితం చేసే నియోజకవర్గాలుగా టెక్కలి, ఇచ్ఛాపురం ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ మనుషులే ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు. టెక్కలి ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యేగా బెందాళం అశోక్ ఉన్నారు. ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో తనకు టికెట్ ఇవ్వాలని కోరుతూ గుర్నాథ్ యాదవ్ మొన్నటి వేళ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోనూ, ఇతర పార్టీ పెద్దలతోనూ భేటీ అయి తన విన్నపాన్ని విన్నవించారాయన. ఈయన టెక్కలి నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడి నేత దువ్వాడ శ్రీనుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆయన కాళింగ సామాజిక వర్గ నేత.
మరో నేత పేడాడ తిలక్ (ఈయనకు గ్రానైట్ వ్యాపారుల అండదండలు ఉన్నాయి) కు కాళింగ సామాజివర్గం ఉన్నతి కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన కార్పొరేషన్ కు చైర్మన్ గా ఉన్నారు. వీళ్లద్దరూ గత ఎన్నికల్లో పరాజితులే ! అయితే పేరాడ తిలక్ కు ధర్మాన ప్రసాదరావు (రెవెన్యూ మంత్రి) మద్దతు ఉందని అంటారు. దువ్వాడ శ్రీను అక్కడ ఉన్న లోకల్ లీడర్లు అయిన కిల్లి కృపారాణి (కేంద్ర మాజీ మంత్రి)తోనూ, తిలక్ తోనూ విభేదాలు ఉన్నాయని అంటుంటారు స్థానిక వైసీపీ వర్గాలు. ఈ నేపథ్యంలో కొత్తగా తెరపైకి గుర్నాథ్ యాదవ్ పేరు వినిపిస్తోంది.
ఆయనకు టికెట్ కూడా కన్ఫం అంటున్నారు. గత ఎన్నికల్లో పరాజితులుగా అటు దువ్వాడ (శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి పోటీచేశారీయన), ఇటు పేరాడ (టెక్కలి ఎమ్మెల్యే స్థానానికి పోటీచేశారీయన) మిగిలిపోయినా వీరికి సముచిత స్థానం కల్పించి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి, ఉన్నంతలో క్యాబినెట్ హోదా కాకపోయినా, ఆ హోదాకు సమానం అయిన స్థాయిలోనే గౌరవించింది వైసీపీ సర్కారు. ఈ సారి జగన్ వ్యూహం ప్రకారం ఎలా అయిన టీడీపీ అభ్యర్థి అచ్చెన్నను ఓడించేందుకు కాళింగులు కాకుండా మధ్యేమార్గంగా యాదవ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని యోచిస్తున్నారు. ఆ విధంగా చేస్తూనే టెక్కలి టికెట్ ను యాదవులకు కేటాయించాక సంబంధిత అభ్యర్థిని గెలిపించే బాధ్యత మంత్రి ధర్మాన ప్రసాదరావుకు అప్పగించనున్నారు.
ఎందుకంటే మంత్రి ధర్మాన ప్రసాదరావుకు యావత్ యాదవ సంఘం ఎప్పుడూ బాహాటంగా మద్దతు ఇస్తూనే ఉంటుంది కనుక ! గుర్నాథ్ యాదవ్ ను గెలిపించే బాధ్యత ధర్మానకు అప్పగించే అవకాశాలే మెండు.ఇక ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కూడా ఎప్పటి నుంచి నర్తు రామారావు టికెట్ ఆశిస్తున్నారు. గతంలో ఈయన కీలక పదవుల్లో పనిచేశారు. ఈయనతో పాటు పలువురు యాదవ సంఘం నాయకులు టికెట్ ఆశిస్తున్నారు. వీరి లో ఎవరికి అదృష్టం వరిస్తుందో ఇప్పుడే చెప్పలేం. 2019లో ఇచ్ఛాపురం నుంచి వైసీపీ టికెట్ ఆశించినా దక్కలేదు.
దీంతో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ పదవి వరించింది. . 1994, 99, 2004లో ఇచ్ఛాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు అని ఇచ్ఛాపురం ప్రాంత వాసులు చెబుతున్నారు. 2013లో వైసీపీలో చేరాక, అనూహ్యంగా జగనన్న విధేయుడిగా 2014లో ఇచ్ఛాపురం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో అంటే పదేళ్ల తరువాత ఆయన పోటీ కి సిద్ధం అవుతున్నారు.గత ఎన్నికల్లో ఇచ్ఛాపురంలో బరిలో దిగిన పిరియా సాయిరాజ్ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ టికెట్ యాదవ సామాజికవర్గంలో ఎవరో ఒకరికి ఇవ్వాలని ఆ నియోజకవర్గ ప్రతినిధులు పట్టుబడుతున్నారు.