చంద్రబాబు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పాలనలో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో భారీ స్థాయి అవినీతి జరిగిందని, రివర్స్ టెండరింగ్ అని జగన్ నానా యాగీ చేశారు. కానీ, చంద్రబాబుపై ఆరోపణలు నిరూపించడంలో జగన్ విఫలమయ్యారని టీడీపీ నేతలు విమర్శించారు. ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ విరుచుకుపడ్డారు.
చంద్రబాబు హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందా? లేదా అని తేల్చేందుకు జగన్ ప్రభుత్వం విచారణ కమిటీలు వేశారని, హైకోర్ట్ తలుపుకూడా తట్టి అభాసుపాలయ్యారని పయ్యావుల విమర్శించారు. హైకోర్టు వాదనతో ఏకీభవించిన వైసీపీ ప్రభుత్వం ఆ విద్యుత్ ఒప్పందాలకు ప్రభుత్వవాటాగా నిధులు విడుదల చేసిందని ఆయన గుర్తు చేశారు. నిజానిజాలు నిగ్గు తేలుస్తామంటూ నాలుగేళ్లుగా అబద్ధాలతో ప్రజలను జగన్ నమ్మిస్తున్నాడని, విద్యుత్ ఛార్జీల భారంతో కుంగదీస్తున్నాడని మండిపడ్డారు.
విద్యుత్ కొనుగోళ్ల టెండర్లలో తన అనుకున్నవాళ్లకు జగన్ మేలుచేస్తూ ప్రజలపై భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. సోలార్ విద్యుత్ పై దుష్ప్రచారం చేసిన జగన్…చివరకు తన అనుకూల అదానీ సంస్థకు కట్టబెట్టాలని చూశారని మండిపడ్డారు. చివరకు టాటా కంపెనీ కోర్టుకు వెళ్లడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దుచేసుకుందని అన్నారు..
పంప్డ్ స్టోరేజ్ విషయంలో కూడా అరబిందో, గ్రీన్ కో లాంటి వాటికి ప్రభుత్వ ఆస్తుల్ని కట్టబెట్టే ప్రయత్నంచేశారని మండిపడ్డారు. జగన్ తప్పు తెలుసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని, చంద్రబాబుకు క్షమాపణ చెప్పేంత పెద్దమనసు ఆయనకు లేదని చురకలంటించారు.