సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు విచారణలో జగన్ సహకారం లేదని, అందుకే ఈ కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలని ఇటీవల వివేకా కూతురు సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ కేసును జగన్ తో పాటు కొందరు వైసీపీ నేతలు పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అంతేకాుద, వివేకా హత్య జరిగిన సమయంలో ఆ నిందను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్, వారి కుటుంబంపై వైసీపీ నేతలు మోపడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే గత ఏడాది ఏప్రిల్ 14వ తేదీన జగన్ కు నారా లోకేష్ సవాల్ విసిరారు. వివేకా హత్యతో తనకు, తన కుటుంబానికి సంబంధం లేదని తిరుమల వెంకన్న సాక్షిగా లోకేష్ ప్రమాణం చేశారు. అంతేకాదు, జగన్ కూడా తనకు ఆ హత్యతో సంబంధం లేదని ప్రమాణం చేస్తారా అని లోకేష్ సవాల్ విసిరారు.
అయితే, లోకేష్ అన్నమాట ప్రకారం ప్రమాణం చేశారు కానీ జగన్ మాత్రం ప్రమాణం చేయడానికి ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకి వెళ్తున్న జగన్ కు లోకేష్ గతంలోని సవాల్ ను గుర్తు చేశారు. మీ బాబాయి హత్యతో సంబంధం లేదని తిరుమల శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమా జగన్ రెడ్డి అంటూ లోకేష్ ఛాలెంజ్ చేశారు. తిరుమలకు వెళ్తున్న మీరు శ్రీవారిపై ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు.
అలా ప్రమాణం చేయకపోతే బాబాయిపై గొడ్డలిపోటు జగనాసుర రక్త చరిత్ర అని ఒప్పుకుంటారా అని జగన్ ను లోకేష్ నిలదీశారు. ఈ క్రమంలోనే అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అనే హ్యాష్ ట్యాగ్ ను లోకేష్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేశారు. మరి ఈసారైనా లోకేష్ ఛాలెంజ్ ను జగన్ స్వీకరించి వివేకా హత్యతో సంబంధం లేదని తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.