రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని ఆడపడుచులకు టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇప్పటికే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అవసరమైతే మరో సిలిండర్ కూడా ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. టిడిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన రాఖీ పౌర్ణమి వేడుకలలో పాల్గొన్న చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. చంద్రబాబుకు టిడిపి మహిళా నేతలు వంగలపూడి అనిత, పీతల సుజాత, బ్రహ్మకుమారి ఇతర టిడిపి మహిళా నేతలు రాఖీ కట్టారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లకు చంద్రబాబు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళలుగా తెలుగు మహిళలను తీర్చిదిద్దుతామని అన్నారు. బంధాలు, భారతీయ సంస్కృతికి ఉన్న ప్రత్యేకతని తెలుగువారు దశదిశలా వ్యాప్తి చేస్తున్నారని, విదేశాలలో కూడా మన సంస్కృతిని మెచ్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు. మహిళల అభివృద్ధి కోసం దూరదృష్టితో టిడిపి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని, ఎన్నో సంస్థలు స్థాపించిందని గుర్తు చేసుకున్నారు.
మహిళలకు ఎన్టీఆర్ ఆస్తి హక్కు కల్పించారని, పద్మావతి మహిళా కాలేజ్ ని నెలకొల్పారని గుర్తు చేసుకున్నారు. బాలికా సమృద్ధి సంరక్షణ పథకాన్ని తాను ప్రారంభించానని చెప్పారు. ఇక, చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కోసం కృషి చేస్తామని ప్రకటించారు. డ్వాక్రాతో మహిళల పొదుపునకు పెద్ద పీట వేశామని, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన పార్టీ టిడిపి అని చెప్పారు.