బీసీ జయహో సభలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. గతంలో మంగళగిరిలో 5300 ఓట్ల తేడాతో ఓడిపోయానని, ఈ సారి ఎన్నికల్లో 53000 ఓట్ల మెజారిటీతో నెగ్గి మంగళగిరి స్థానాన్ని చంద్రబాబు, పవన్ అన్నలకు గిఫ్ట్ గా ఇస్తానని లోకేష్ హామీనిచ్చారు. బీసీలు అంటే బలహీనవర్గం కాదని, బలమైన వర్గం అని లోకేష్ చెప్పారు. 3 వేల కోట్ల నిధులతో 4.20 లక్షల మంది బీసీలను పేదరికం నుంచి బయటకు తెచ్చిన పార్టీ టీడీపీ అని లోకేష్ అన్నారు.
ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు కేటాయించామని, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కిల్ డెవలప్ మెంట్, స్టడీ సర్కిళ్లు, విదేశీ విద్య వంటి పథకాలు తెచ్చింది పసుపు జెండా అని చెప్పారు. చేనేత కార్మికులకు, మత్స్యకారులకు, కల్లు గీత కార్మికులకు 50 ఏళ్లకు లోపే పెన్షన్లు అందించింది టీడీపీ అని వెల్లడించారు. బీసీల కోసం మంత్రిత్వ శాఖ ఉండాలని టీడీపీ తీర్మానం చేసిందని, ఈ సైకో జగన్ సీఎం అయ్యాక బీసీ సోదరులను వెన్నుపోటు పొడిచాడని దుయ్యబట్టారు.
స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు తగ్గించి 16 వేల మందికి పదవులు దూరం చేసి బీసీలకు వెన్నుపోటు పొడిచాడని ధ్వజమెత్తారు. బీసీలకు చెందిన 8 వేల ఎకరాల అసైన్ మెంట్ భూములను వెనక్కి తీసుకున్నారని దుయ్యబట్టారు. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లకు కుర్చీలు, టేబుళ్లు లేవని, 75 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారని ఆరోపించారు. సైకో జగన్ జీవో నెం.217తో మత్స్యకారులకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఆప్కాబ్ ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
300 మంది బీసీలను చంపేసి, 26 వేల మంది బీసీలపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యనమల రామకృష్ణుడు పెళ్లికి వెళితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని, అయ్యన్నపాత్రుడిపై ఏకంగా రేప్ కేసు పెట్టారని ధ్వజమెత్తారు. కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడిపై కేసులు పెట్టి అరెస్టు చేశారని దుయ్యబట్టారు. బీసీలపై మీరు పెట్టే ఎఫ్ఐఆర్ లను మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి, రెండే రెండు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది. రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి… జాగ్రత్త అని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.