డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో జరిగిన ‘రా కదలిరా’ సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అతిథి మర్యాదలకు మారుపేరు కోనసీమ అని, మంచి నీళ్లు అడిగితే కొబ్బరి నీళ్లు ఇచ్చే మంచి మనసున్న మనుషులు ఇక్కడున్నారని చెప్పారు.
అమలాపురం పార్లమెంటు స్థానం పరిధిలోని 7 సీట్లనూ టీడీపీ గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
కోనసీమ వంటి ప్రశాంతమైన ప్రాంతాన్ని దాడులు, కేసులు, ఆత్మహత్యలు అంటూ హింసకు కేంద్రంగా మార్చేశారని మండిపడ్డారు. కోనసీమలో ఇంటర్నెట్ నిలిపివేసే పరిస్థితి ఏర్పడిందంటే ఇక్కడ శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఈ వైసీపీ సైకో పాలనలో కోనసీమను మరో పులివెందుల చేయాలనుకుంటున్నారని, అయితే, పులివెందులనూ మార్చుతాం గానీ, కోనసీమలో వైసీపీ రౌడీయిజం చెల్లనివ్వబోనని చంద్రబాబు సవాల్ విసిరారు.
“ఇవాళ నేను రా కదలిరా అని పిలుపునిచ్చాను. ఇది నా కోసం కాదు. దగా పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ఒక రైతు కోసం, ఒక కూలీ కోసం, ఒక నిరుద్యోగి కోసం… రాష్ట్రమంతి కదలి రావాలని పిలుపునిచ్చాను. అందుకు మీరంతా స్పందించారు. ఇది నా కోసమో, పవన్ కల్యాణ్ కోసమో కాదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత” అని చంద్రబాబు భావోద్వేగంతో అన్న మాటలు ప్రజలను ఆలోచింపజేశాయి.
అంతకుముందు, చంద్రబాబు విశాఖ నుంచి అరకు వెళుతుండగా ఆయనకు పెను ప్రమాదం తప్పింది. ఏటీసీ సమన్వయ లోపంతో చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పింది. అది గుర్తించిన ఏటీసీ అధికారులు వెంటనే పైలెట్ ను అప్రమత్తం చేశారు. చంద్రబాబు హెలికాప్టర్ రాంగ్ రూట్లో వెళుతోందని పైలట్ కు వివరించింది. దీంతో,చంద్రబాబు హెలికాప్టర్ వెంటనే వెనుదిరిగి..కాసేపటి తర్వాత సరైన మార్గంలో వెళ్లింది.