కాకినాడ సీ పోర్టు వాటాలను కేవీ రావు నుంచి బలవంతగా లాక్కున్నారని వైసీపీ రాజ్య సభ సభ్యుడు విజయసాయిరెడ్డి పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సాయిరెడ్డిపై ఏపీ సీఐడీ అధికారులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. దీంతో, సీఎం చంద్రబాబుపై సాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘బతికి ఉంటే.. అరెస్టు తప్పదు…చంద్రబాబు దుర్మార్గుడు, దుష్టుడు’ అంటూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
ఈ క్రమంలోనే సాయిరెడ్డికి టీడీపీ నేత బుద్ధా వెంకన్న వార్నింగ్ ఇచ్చారు. సాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని బుద్ధా హెచ్చరించారు. సాయిరెడ్డికి, జగన్ కు కులపిచ్చి ఉందేమోనని విమర్శించారు. మానవతా విలువలు లేని వ్యక్తి సాయిరెడ్డి అని దుయ్యబట్టారు. సాయిరెడ్డిపై క్రిమినల్ కేసు పెడతామని, ఆయనను జైలుకు పంపేంతవరకు వదలనని బుద్దా వెంకన్న ఛాలెంజ్ చేశఆరు. వ్యాపారవేత్తలను భయపెట్టి, బెదిరించి ఆస్తులు రాయించుకుంటారా? అని బుద్ధా ప్రశ్నించారు.
కాగా, సీఎం చంద్రబాబును విమర్శించిన సాయిరెడ్డి…డిప్యూటీ సీఎం పవన్ పై ప్రశంసలు కురిపిస్తున్న వైనం చర్చనీయాంశమైంది. జాతీయస్థాయిలో చక్రం తిప్పేందుకు పవన్ కు అవకాశం ఉందని, చంద్రబాబుకు లేదని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే సాయిరెడ్డికి బుద్ధా కౌంటర్ ఇచ్చారు.