తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ కాలికి గాయం కావడంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరు కావడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా నల్గొండలో నిర్వహించిన ‘జల శంఖారావం’ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాలు విరిగినా కట్టె పట్టుకుని మీ కోసం వచ్చానంటూ సభకు వచ్చిన ప్రజలనుద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.
తాను నిలబడలేనని, కూర్చొనే మాట్లాడతానని కేసీఆర్ చెప్పారు. ఇది రాజకీయ సభ కాదని, ఉద్యమ సభ, పోరాట సభ అని ఆయన అన్నారు. 5 జిల్లాల జీవన్మరణ సభ అని, నీళ్లు లేకుంటే మన బతుకు లేదని కేసీఆర్ చెప్పారు. తెలంగాణకు రావాల్సిన నీటిని కాజేయాలనుకుంటున్న వారికి ఈ సభ ఓ వార్నింగ్ అని ఏపీని ఉద్దేశించి కేసీఆర్ చేసిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి. కృష్ణా జలాలు తెలంగాణ జీవన్మరణ సమస్య అని, తెలంగాణ వాటాను సాధించుకోవాలని చెప్పారు. చావో, రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కేసీఆర్ చెప్పారు.
తుదిశ్వాస విడిచేవరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వబోనని, పులిలా లేచి కొట్లాడతానే తప్ప, పిల్లిలా ఉండనని కేసీఆర్ అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టింది తమ ప్రభుత్వమేనని, గతంలో ఏ నాయకుడూ పోరాడలేదని అన్నారు. ఇక, గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలిచ్చే బర్రెను కాకుండా దున్నపోతును తెచ్చుకున్నారని ప్రజలనుద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించానని, తన జీవితం తెలంగాణకు అంకితం అని చెప్పారు.
కాగా, ఈ సభకు వస్తున్న కేటీఆర్, హరీశ్ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న బస్సు, వాహనాలపై ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు అడ్డుకొని కోడిగుడ్లు విసిరారు.. నల్లచొక్కాలను ధరించి బీఆర్ఎస్ వ్యతిరేక నినాదాలు చేశారు. బస్సుపై కోడిగుడ్లను విసిరారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు గోబ్యాక్ అంటూ వారు నినాదాలు చేశారు. మరోవైపు, కేటీఆర్, హరీశ్ రావులను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి ఉద్రిక్త పరిస్థితిని చక్కదిద్దారు.