వైసీపీపై రెబల్ ఎంపీ రఘురామ కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ పాలనను, వైసీపీ నేతల అక్రమాలను రఘురామ ఎప్పటికప్పుడు ఎండగడుతుంటారు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో టీడీపీ లేదా బీజేపీ తరఫున ఆయన నరసాపురం ఎంపీగా పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తాను టీడీపీ-జనసేన తరఫున పోటీ చేయబోతున్నానని రఘురామ సంచలన ప్రకటన చేశారు.
ఇక, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని వైసీపీ నేతల విమర్శలను రఘరామ ఖండించారు. ఆమెపై వైసీపీ నేతలు కారుకూతలు కూస్తున్నారని, మహిళ, ఓ పార్టీ అధ్యక్షురాలు అని చూడకుండా ఎలాపడితే అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల విమర్శలపై జగన్ స్పందించడం లేదని, ఏపీలో మహిళలకు జగన్ ఇచ్చే రక్షణ ఇదే అని ఎద్దేవా చేశారు.
ఇక, ప్రధాని మోడీకి జగన్ అసలు రూపం తెలిసి, జగన్ కు జైలర్ సినిమా కనిపించబోతుందని సెటైర్లు వేశారు. సొంత కొడుకును రజనీకాంత్ చంపేసినట్లు, ఏపీలో దృశ్యాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఇచ్చే పథకాలకు కేవలం రాష్ట్ర ప్రభుత్వం పేరు పెడుతున్నారని, దీంతో, 5,300 కోట్ల రూపాయల నిధులను కేంద్రం ఆపేసిందని రఘురామ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సీఎం ఫోటో, పిఎం ఫోటో వేయాలని అన్నారు. అంతేకగానీ, సొంత డబ్బులు ఇస్తున్నట్టుగా తన ఫోటో లేదా తన తండ్రి ఫోటో వేయడం ఏమిటని జగన్ కు చురకలంటించారు.