క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే . చాలాకాలంగా పార్టీ వైఖరి నచ్చక విమర్శలు గుప్పిస్తున్న ఆనం ఎట్టకేలకు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాము 10 నుంచి 20 కోట్లు తీసుకుని టీడీపీకి అమ్ముడుపోయామని సజ్జల చేసిన వ్యాఖ్యలపై కూడా ఆనం మండిపడ్డారు. అయితే, ఆ తర్వాత ఆనం టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ, అధికారికంగా ఆనం నోటి వెంట ఆ మాట రాలేదు.
ఈ నేపథ్యంలోనే తాజాగా తన రాజకీయ భవిష్యత్తుపై ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమని ఆనం ప్రకటించారు. కానీ, తాను ఎంపీగా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని వస్తున్న వార్తలలో నిజం లేదని ఆనం అన్నారు. తాను అసెంబ్లీ ఎన్నికల బరిలోనే దిగుతానని, ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేస్తానని ఆనం స్పష్టం చేశారు. త్వరలో ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయి అంటున్న ప్రచారంపై కూడా ఆనం స్పందించారు.
ఈ ఏడాది చివర నవంబర్ లేదా డిసెంబర్లో ముందస్తు ఎన్నికలు ఉంటాయని ఆనం అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాల్లో టీడీపీ విజయకేతనం ఎగరవేస్తుందని ఆనం జోస్యం చెప్పారు. ఎన్నికలకు ముందు 60 శాతం మంది వైసీపీ నుంచి టిడిపిలోకి వస్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అధికారంలో వైసీపీ ఉన్నందున తమ పనులు చక్కబెట్టుకునేందుకు చాలా మంది అయిష్టంగానే ఆ పార్టీలో కొనసాగుతున్నారని ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు.