తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈటలను సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారని, కావాలనే భూముల కబ్జా వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. త్వరలోనే ఈటల బీజేపీలో చేరబోతున్నారని, ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీం నగర్ ఎంపీ బండి సంజయ్ తో పాటు మాజీ ఎంపీ వివేక్ తో ఈటల భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది.
అంతేకాకుండా, ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో కూడా ఈటల టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఇప్పటివరకు ఈటల తనను కలవలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనను కలిసేందుకు ఈటల ప్రయత్నించారని, త్వరలోనే కలుస్తారని అన్నారు. అయినా, ఈటల, తాను 15 ఏళ్ళపాటు కలిసి పనిచేశామని, ఇప్పుడు కలిస్తే తప్పేంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో బీజేపీలో చేరికపై ఈటల రాజేందర్ స్పందించారు. తాను బీజేపీ నేతలను కలిసిన మాట వాస్తవమేనని, కానీ, తాను బీజేపీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలు మాత్రం అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ హుజూరాబాద్ నుంచే పోటీ చేయాలనుకుంటున్నానని ఈటల స్పష్టం చేశారు. ఈ విషయంపై త్వరలోనే అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని అనుకుంటున్నానని, ఉప ఎన్నికలో బీజేపీ తనకు మద్దతునివ్వాలని కోరేందుకే వారితో భేటీ అయ్యానని ఈటల వెల్లడించారు.