ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య పబ్లిక్ మీటింగ్స్‌లో ప్రతి పక్ష పార్టీల ముఖ్య నేతల గురించి చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినపుడల్లా జగన్ వ్యక్తిగత వ్యాఖ్యలే చేస్తున్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి రాజకీయంగా విమర్శలు చేయాలి కానీ.. ప్రతిసారీ వ్యక్తిగత విషయాల మీదే విమర్శలు చేసి జనం దృష్టిలో పలుచన అయిపోతున్నారు.
గతంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడే జగన్.. ఇప్పుడు పవన్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఆ విషయం తప్ప వేరే విషయం ఎత్తట్లేదు. పవన్ చేసుకున్నది మూడు పెళ్లిళ్లే అయినా.. నాలుగు పెళ్లిళ్లు అంటూ ఎగ్జాజరేట్ చేయడమే కాక.. ఆయన మాజీ భార్యలు, ప్రస్తుత భార్య గురించి దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారు. తాజాగా లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంటూ పవన్ భార్యల గురించి మరీ దారుణమైన వ్యాఖ్యలు చేశారాయన.
ఐతే పవన్ గురించి విమర్శలు చేయాల్సి వస్తే.. ప్రతిసారీ పెళ్లిళ్లు, ప్యాకేజీ, దత్తపుత్రుడు అంటూ స్థాయి తక్కువ, వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తుంటే.. రాజకీయంగా పవన్‌ను అనడానికి ఇంకేమీ కనిపించట్లేదు అనే భావన జనాల్లోకి వెళ్తుంది. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే కానీ.. ప్రతిసారీ అవే మాటలు అంటే సామాన్య జనాలకు ఇలా మాట్లాడే వ్యక్తి మీద వ్యతిరేకత వస్తుందే తప్ప.. ప్రయోజనం శూన్యం. జగన్ వ్యాఖ్యలు ఆయన వీరాభిమానులు, పార్టీ వాళ్లకు మహదానందం కలిగించొచ్చు. కానీ సామాన్య జనాల దృష్టిలో అదొక పైశాచిక ఆనందంలానే కనిపిస్తుంది.
ప్రతిపక్షంలో ఉన్న బలహీనుడి మీద అధికారంలో ఉన్న బలవంతుడు పదే పదే ఇలా వ్యక్తిగత వ్యాఖ్యలతో దాడి చేస్తే.. అవతలి వ్యక్తి మీద జనాల్లో సానుభూతి కలుగుతుందే తప్ప, అధికారంలో ఉన్న వ్యక్తికి అది ఎలాంటి లాభం చేకూరదు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడంటే అది ఆయన వ్యక్తిగత విషయం. అది కూడా అధికారికంగా విడాకులు ఇచ్చే ఆయన మరో పెళ్లి చేసుకున్నాడు తప్ప, చట్టవిరుద్ధం అంటూ అందులో ఏమీ లేదు. జనాలకు దాని వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. పవన్ ఒక నాయకుడిగా ఏంటి అనేదే జనం చూస్తారు.