జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తనను మించిన శ్రేయోభిలాషి లేరన్నట్లు మాట్లాడేవారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నా 60-70 సీట్లు తీసుకోవాలని.. పవర్ షేరింగ్ కూడా డిమాండ్ చేయాలని లేఖలు రాసిన నేత ఆయన. కానీ కాపు నేత స్థానాన్ని వదిలిపెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ముద్రగడ ఇప్పుడు పవన్‌కు బద్ధ శత్రువుగా మారిపోయారు.
పవన్ ఓటమే ధ్యేయంగా ఆయన పిఠాపురంలో తిష్ట వేసి దశల వారీగా ప్రెస్ మీట్లు పెట్టి పవన్‌ను ఘాటుగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా వాళ్లు రాజకీయాలకు పనికి రారని పేర్కొంటూ పవన్‌ను ఓడించి వాళ్లకు బుద్ధి చెప్పాలని ఈ మధ్యే వ్యాఖ్యానించారు ముద్రగడ. తాజాగా పవన్ మీద మరింతగా విమర్శల దాడిని పెంచారు ముద్రగడ. పవన్‌ను ఓడించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని.. కచ్చితంగా ఓడించి పంపిస్తామని.. అలా ఓడించకుంటే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాలు విసరడం విశేషం.
పవన్‌ను ఓడించకపోతే పద్మనాభంగా ఉన్న తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటామని ఒకటికి రెండుసార్లు ఆయన నొక్కి వక్కాణించారు. మరోసారి రంగులేసుకునేవాళ్లు అంటూ సినిమా వాళ్లను ఎద్దేవా చేసిన ముద్రగడ.. పవన్ అసలెందుకు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడని ముద్రగడ ప్రశ్నించారు. ముందు ఆయన అడ్రస్ చెప్పాలని.. ఆయనది ఏ మండలమో చెప్పాలని.. పిఠాపురంలో పోటీ చేయడం అంటే ఇక్కడి జనాలు అంత లోకువా ఆయన ప్రశ్నించారు.
కాగా, పవన్‌ను ఓడించకుంటే పేరు మార్చుకుంటానని ముద్రగడ చేసిన సవాల్ మీద గట్టిగానే పంచులు పడుతున్నాయి. ఆల్రెడీ రెడ్డి పార్టీలో చేరిన ముద్రగడ కొత్తగా తన పేరు వెనుక రెడ్డి తగిలించుకోవాల్సిన పని లేదని కొందరంటే.. పద్మనాభరెడ్డిగా కాకుండా పద్మనాభసింహాగా మార్చుకుంటే యాప్ట్‌గా ఉంటుందని మరికొందరు కౌంటర్ వేస్తున్నారు.