సీఎం జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సొంత అన్నను జగన్ రెడ్డి అంటూ షర్మిల సంబోధించడం షాకింగ్ గా మారింది. అయితే, జగన్ ను షర్మిల అలా పిలవడంపై జగన్, షర్మిలల బాబాయి, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై షర్మిల స్పందించారు. ఇకపై జగన్ రెడ్డి అని పిలవబోనని…జగనన్న గారూ అనే సంబోధిస్తానని షర్మిల చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
జగన్ రెడ్డి గారూ అని పిలిస్తే అధికార పార్టీ నేతలకు నచ్చడం లేదని, ఇకపై జగనన్న గారూ అనే పిలుస్తానని షర్మిల అన్నారు. ఈ రోజు నుంచి జిల్లాలలో కాంగ్రెస్ నేతలతో సమీక్షలు మొదలుబెట్టిన షర్మిల పలాసలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. స్థానిక నేతలతో కలిసి బస్సెక్కిన షర్మిల.. ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలు, ప్రభుత్వ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ వ్యక్తి అంటూ వైవీ సుబ్బారెడ్డి చేసిన విమర్శలపై షర్మిల స్పందించారు. ఏపీలో వైసీపీ చేసిన అభివృద్ధి చూపించాలని షర్మిల సవాల్ విసిరారు.
వైసీపీ నేతలు చూపించే అభివృద్ధిని చూడడానికి రాష్ట్రంలోని ఏ ప్రాంతమైనా.. ఏ రోజైనా.. ఏ సమయంలోనైనా వచ్చి చూసేందుకు తాను రెడీ అన్నారు. టైం మీరు చెప్పినా సరే..నన్ను చెప్పమన్నా సరే అంటూ సమరసింహారెడ్డిలో బాలయ్య బాబు మాదిరి షర్మిల చెప్పిన డైలాగ్ వైరల్ గా మారింది. ఆ ధైర్యం అధికార పార్టీ నేతలకుంటే తనతోపాటు ప్రతిపక్ష నేతలు, మీడియా ప్రతినిధులు, మేధావులు చూసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. మరి, షర్మిల సవాల్ పై వైసీపీ నేతల స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.