“ఇది ప్రజాప్రభుత్వం.. ఇది మనందరి ప్రభుత్వం“ అని చెబుతున్న ముఖ్యమంత్రి.. ఏపీని మరో మహారాష్ట్ర చేసేస్తున్నారంటూ.. జనాలు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో విశాక ఉక్కు పరిశ్రమలో నిత్యం వందల టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతున్నా.. దీనిని రాష్ట్రానికి వినియోగించుకునేలా.. కేంద్రాన్ని ఒప్పించడంలో జగన్ విఫలమయ్యారు. ఫలితంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. తాజాగా విజయనగరం జిల్లాలో మహారాజా మెడికల్ వైద్య శాలలో ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన లోపం కారణంగా.. ఇద్దరు చనిపోయారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే..ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని ఆసుపత్రి వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. ఇక, ప్రకాశం, నెల్లూరు, కృష్ణాలోని విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు జీజీహెచ్, కర్నూలు కోవిడ్ కేంద్రం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ నిండుకుంది. ఈ విషయంపై వైద్యులు గగ్గోలు పెడుతున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అయితే.. రోగులు ఆక్సిజన్‌తో వస్తేనే ఆసుపత్రుల్లోకి అనుమ తిస్తామని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. దీంతో అక్కడ రోగులు ప్రాణవాయువు కోసం.. అల్లాడుతున్నారు.
ఇటీవల మహారాష్ట్రలోనూ ఇదే జరిగింది. ప్రాణవాయువు అందక, ఆక్సిజన్ సరఫరాలో లోపాలు, లీకేజీల కారణంగా.. పదుల సంఖ్యలో కరోనా బాధితులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కన్నుమూశారు. వాస్తవానికి ఇలాంటి పరిణామాలు.. పొరుగు రాష్ట్రాలకు పాఠం కావాల్సి ఉంటుంది.కానీ, ఘనత వహించిన జగన్ నేతృత్వంలోని సర్కారు.. మాత్రం చాలా చాలా లైట్ తీసుకుంటోందని అంటున్నారు ప్రజలు. నెల తిరిగే సరికి నిధులు కుమ్మరిస్తున్నాం.. ఇంతకన్నా ఏం చేస్తాం అని అనుకుంటున్నారు.
అంతే తప్ప.. ప్రజల ప్రాణాలను కాపాడాలనే స్పృహ లేకుండా పోయిందని.. మేధావులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఇప్పటికైనా.. జగన్ కన్ను తెరుస్తారా? లేదా? అనేది ప్రశ్నగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. మహారాష్ట్ర పరిణామాలు ఏపీలో సంభవించేందుకు గంటల వ్యవధే ఉందన్నది కీలక వైద్యుల అనధికార హెచ్చరిక!!