ఎన్నికల వేళ చోటు చేసుకునే సిత్రాలకు కొదవ ఉండదు. తాజాగా అలాంటి సిత్రమే ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుకుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో అధికార వైసీపీ కి చెందిన అభ్యర్థిగా ఆయన సతీమణి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న వార్తలు సంచలనంగా మారాయి. ఓవైపు ఎమ్మెల్యే అభ్యర్థిగా భర్త ప్రచారం చేసుకుంటూ ఉంటే.. మరోవైపు అధికార పార్టీ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగే భర్త పైన ఇండిపెండెంట్ అభ్యర్థిగా భార్య బరిలోకి దిగేందుకు సిద్ధమైన అంశం షాకింగ్ గా మారింది.
అంతేకాదు.. ఈ నెల 22న ఆమె నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా ముహుర్తాన్ని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే తన వర్గంతో ఆమె చర్చించినట్లుగా తెలుస్తోంది. టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ కు టికెట్ ను కేటాయించటం తెలిసిందే. అయితే.. ఈ నిర్ణయంపై ఆయన సతీమణి దువ్వాడ వాణీ గుర్రుగా ఉన్నారు. దీంతో ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు.
దువ్వాడ శ్రీను అభ్యర్థిత్వాన్ని ఆయన సతీమణి వాణి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పంచాయితీ వైసీపీ అధినేత.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనును పక్కన పెట్టి.. వాణికి టికెట్ కేటాయించనున్నట్లుగా పేర్కొన్నారు. తర్వాతేమైందో కానీ.. తన నిర్ణయాన్ని మార్చుకున్న జగన్ టికెట్ ను దువ్వాడ శ్రీనుకే కట్టబెట్టారు.
దీంతో ఆమె అలకబూనటమే కాదు.. చివరకు ఎన్నికల బరిలోకి రావాలని డిసైడ్ అయ్యారు. గడిచిన కొంతకాలంగా భర్తతో విభేదాలు నడుస్తున్న వేళ.. తాజా రాజకీయ పరిణామాలు వారి మధ్య మరింత వైరాన్ని పెంచేలా మారాయని అంటున్నారు. మరి.. ఈ పరిణామం రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరిగేలా చేస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.