సోషల్ మీడియాలో కొన్ని హ్యాష్ ట్యాగ్స్, ట్రెండ్స్ చూస్తే.. వీళ్లకు అసలు పనేమీ ఉండదా? ఇదేం లాజిక్ అని సందేహాలు కలుగుతుంటాయి. ప్రతి విషయాన్నీ వివాదం చేస్తూ నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి సెలబ్రెటీలను టార్గెట్ చేయడం ఒ జాఢ్యంలా మారిపోతోంది. కొన్ని నెలల నుంచి బాలీవుడ్ సినిమాలను సిల్లీ రీజన్స్‌తో టార్గెట్ చేస్తూ ‘బాయ్‌కాట్ బాయ్‌కాట్’ అని అరవడం చూస్తున్నాం. తాజాగా కన్నడిగులు కొందరు ఇలాగే రష్మికను టార్గెట్ చేస్తున్నారు. ఆమెను కన్నడ ఇండస్ట్రీ నుంచి బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేసేవాళ్లు కొందరైతే.. ఆల్రెడీ ఆ దిశగా శాండిల్‌వుడ్ అడుగులు వేస్తోందని.. నిషేధం విధించడమే తరువాయి అని కూడా ప్రచారం చేసేస్తున్నారు.
నిజంగా కన్నడ ఇండస్ట్రీ జనాలు అలా ఆలోచిస్తున్నా.. లేక వాళ్లు అలాంటి ఆలోచిస్తున్నారని ఈ బాయ్‌కాట్ బ్యాచ్ నమ్మినా అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. కన్నడ సినిమాల నుంచి ఎదిగిన రష్మిక.. ఆ తర్వాత తెలుగు, ఇతర భాషా చిత్రాలకు ప్రయారిటీ ఇస్తూ అక్కడి చిత్రాలను పట్టించుకోవడం లేదన్నది ముందు నుంచి ఉన్న ఆరోపణ. కానీ ఎక్కడ ఎక్కువ డిమాండ్ ఉంటే, పేరొస్తే, డబ్బులు వస్తే అక్కడ సినిమాలు చేయడం ఎవ్వరైనా చేసే పనే. అసలు రష్మికను బ్యాన్ చేయాలంటే ఎవరైనా ఏం కారణం చూపిస్తారన్నది ప్రశ్న. కన్నడ సినిమాలకు ప్రయారిటీ ఇవ్వలేదని అయితే అసలు బ్యాన్ చేయలేరు. ఇక ‘కాంతార’ సినిమా చూడకపోవడం, మీడియా వాళ్లు అడిగితే ఆ విషయం బయటికి చెప్పడం అయితే నేరం కాదు.
ఇక ఓ ఇంటర్వ్యూలో తన తొలి చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు, ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పలేదన్నది రష్మిక మీద ఉన్న ఇంకో విమర్శ. ఈ కారణంతో కూడా ఆమెను నిషేధించలేరు. కన్నడ ఇండస్ట్రీని తక్కువ చేసి, కించపరిచేలా మాట్లాడడం లాంటిదేమైనా రష్మిక చేసి ఉంటే తప్ప ఆమెపై బ్యాన్ విధించడానికి స్కోపే లేదు. ఈ విషయం అర్థం చేసుకోకుండా సిల్లీ రీజన్స్ చెప్పి ఆమెపై ఎవరైనా బ్యాన్ వేయాలనుకున్నా… అలా చేస్తున్నారని ప్రచారం చేసినా వారి అజ్ఞానానికి నవ్వుకోవాల్సిందే.