టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లోకేష్ 63వ రోజు పాదయాత్ర శింగనమల నియోజకవర్గం మార్తాడు శివార్లలోని క్యాంప్ సైట్ నుంచి మొదలైంది. ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రలో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. తన మేనల్లుడు, అల్లుడు లోకేష్ అడుగులో అడుగు వేస్తూ పాదయాత్ర చేశారు.
మామా అల్లుళ్లు కలిసి పాదయాత్ర చేయడంతో టీడీపీ, నందమూరి, నారా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ‘గంజాయి వద్దు బ్రో ’అంటూ ప్రత్యేకమైన టోపీలు ధరించి వినూత్న సందేశమిచ్చారు. ఇక, పాదయాత్ర 800 కి.మీ. మైలురాయిని చేరుకున్న సందర్భంగా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం మార్తాడు వద్ద చీనీ ప్రాసెసింగ్ యూనిట్ కు లోకేష్ సంకల్పించారు. ఆ హామీకి గుర్తుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జగన్ పై లోకేష్ విరుచుకుపడ్డారు. ‘నిన్ను జనం ఎందుకు నమ్మాలి జగన్? యువతను గంజాయి బానిసలు చేసినందుకా? రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచినందుకా? అని లోకేష్ ప్రశ్నించారు. తల్లి, చెల్లెళ్లకే నీపై నమ్మకం లేదు… రాష్ట్రానికి ఏం సాధించారని మిమ్మల్ని నమ్మాలి? అని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి దెబ్బకు జగన్ మైండ్ బ్లాంక్ అయింది… దెబ్బకి దెయ్యం దిగొచ్చింది… ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టాడు అంటూ చురకలంటించారు.
వాలంటీర్లు, గృహ సారథులు జనం దగ్గరకు వెళ్లి జగన్ డప్పు కొట్టాలట. నువ్వే మా నమ్మకం, నువ్వే మా భవిష్యత్తు, జగన్ కి చెబుదాం అని మూడు కొత్త కార్యక్రమాలు ప్రారంభించారు అని ఎద్దేవా చేశారు. సొంత కుటుంబ సభ్యులే నమ్మని జగన్ ని జనం ఎందుకు నమ్మాలి?
రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసిన వాడు ప్రజలకు భవిష్యత్తు ఎలా ఇస్తాడు? అని ప్రశ్నించారు. జగన్ కి చెబుదాం?… ఏం చెప్పాలి? ప్రత్యేక హోదా గురించి చెబుదామా? పెంచేసిన పన్నులు..చెత్త పాలన గురించి ఏం చెబుతాం అని నిలదీశారు.