తలసాని శ్రీనివాసయాదవ్. తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా ఉమ్మడి ఏపీ రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. చంద్రబాబు హయాంలో మంత్రిగా చక్రం తిప్పిన సనత్‌నగర్ ఎమ్మెల్యే.. ప్రస్తుతం టీఆర్ ఎస్ సర్కారులోనూ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. దూకుడు రాజకీయాలకు, హాట్ కామెంట్లకు తలసాని పెట్టింది పేరు. ఇదే ఆయనకు రాజకీయంగా మంచి గుర్తింపు తెచ్చిందని అంటారు.. పరిశీలకులు.
సనత్ నగర్ నియోజకవర్గంపై పట్టున్న నాయకుడిగా.. ప్రజల్లోనూ అందుబాటులో ఉండే నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. చిన్నపాటి వివాదాలు మినహా.. అందరినీ కలుపుకొని పోయే నాయకుడిగా, మాస్ లీడర్‌గా తలసాని పేరు ప్రత్యేకం. ఒకప్పుడు నియోజకవర్గాన్ని శాసించిన కాంగ్రెస్ పార్టీకి తలసాని తనదైన శైలిలో చెక్ పెట్టారు. టీడీపీ జెండా ను.. తదనంతర కాలంలో టీఆర్ ఎస్ పతాకాన్ని కూడా రెపరెపలాడించారు.
నిజానికి గత ఎన్నికల్లో ఆయన గెలుపుపై అధినేతకే నమ్మకం లేదు. అయినా.. గెలిచి తన సత్తాను చాటుకున్నారు. అయితే.. ఇలాంటి నేత కు ఇప్పుడు అదే నియోజకవర్గంలో ఎదురు గాలి వీస్తోందనే అంచనాలు వస్తున్నా యి. తన నియోజకవర్గం పరిధిలోని గ్రేటర్ డివిజన్లలో తనకు అత్యంత నమ్మకస్తులు, ప్రజల్లో ఉండే నేతలకు ఆయన టికెట్లు ఇప్పిం చుకున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో కీలకమైన డివిజన్లు.. . సనత్‌నగర్, బేగంపేట, రాంగోపాల్‌పేట్, బన్సీలాల్‌పేట, మోండా డివిజన్లలో కేవలం బేగంపేటలో మాత్రమే టీఆర్ ఎస్ అభ్యర్థి విజయం దక్కించుకున్నారు. మిగిలిన చోట్ల టీఆర్ ఎస్ దారుణ పరాభవాన్ని చవిచూసింది.
మిగిలిన నియోజకవర్గాలకు ఇక్కడకు చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ అంతా తలసాని తన ఇష్ట ప్రకారమే టికెట్లు ఇప్పించుకున్నారు. తన అనుచరులు శేషుకుమారి, అరుణాగౌడ్, ఆకుల రూపలకు అవకాశం ఇచ్చారు. వారి తరఫున నిరంతరం ప్రచారం చేశారు. అయినా వారంతా ఓడిపోయారు. మరి దీనికి కారణం ఏంటి? మంత్రిగా ఆయన విఫలమ య్యారా? ప్రజల్లో అసంతృప్తిని పసిగట్టలేక పోయారా? తన కుమారుడి దూకుడుకు అడ్డుకట్టవేయలేక పోయారా? అనేది చర్చకు వస్తున్న ప్రధాన విషయం. ఈ పరిణామాలపై తలసాని దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనాఉందని అంటున్నారు పరిశీలకులు. గెలిచినప్పుడు తన విజయంగాను.. లేకుంటే.. అభ్యర్థులపై తోసే విధానాన్ని విడనాడి.. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆయన దృష్టిపెడితేనే మున్ముందు ఆయన ఓటు బ్యాంకు స్థిరపడుతుంది. మరి ఏం చేస్తారో చూడాలి.