ఏపీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇంతకాలం ఓపెన్ కాని అంశాల మీద ఆయన ఓపెన్ అయ్యారు. తాజాగా విలేకరులతో మాట్లాడిన ఆయన.. తనకు తానుగా తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు. తాను ఎవరెవరికి విధేయుడిగా ఉంటాను? లాంటి కీలక విషయాల్ని వెల్లడించారు. ఆయన మాటల్ని విన్నంతనే..కొత్త సందేహాలు కలుగక మానదు.
తనకు చంద్రబాబురాజకీయ భిక్ష పెట్టలేదని.. ఆ మాటకు వస్తే చంద్రబాబే పెద్ద బిచ్చగాడంటూ తనదైన శైలిలో చాలా మొరటుగా.. ముతక్కగా మాట్లాడేందుకు కొడాలి నాని అస్సలు వెనుకాడలేదు.
మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి మాటలుంటాయి కాబట్టి వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనుకోండి. కాకుంటే ఆయన చెప్పిన మాటల్లో కొన్ని లాజిక్ కు దూరంగా.. ఆయనకు వెనుకా ముందు చూసుకోకుండా మద్దతు ఇచ్చే వారు సైతం.. ఇదేంది కొడాలి? ఇలా మాట్లాడేశావ్? అన్న ప్రశ్నను అడిగే రీతిలో మాట్లాడటం గమనార్హం.
చంద్రబాబుకు ఇందిరాగాంధీ రాజకీయ భిక్ష పెట్టిందని.. అలాంటిది తనకు చంద్రబాబు ఎలా రాజకీయభిక్ష పెడతారని ప్రశ్నించారు. తనకు ఎవరైనా రాజకీయ భిక్ష పెట్టిందంటూ ఉంటే.. ఎన్టీఆర్.. వాళ్ల అబ్బాయి హరిక్రిష్ణ.. ఆయన మనమడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పెట్టారని తేల్చేశారు. చంద్రబాబు పెద్ద అడుక్కుతినేవాడని.. తనకు రాజకీయ భిక్ష పెట్టేదేంటి? అని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ తనకు పార్టీలో చేరే అవకాశం ఇస్తే.. హరిక్రిష్ణ తనను తెలుగు యువత అధ్యక్ష పదవిని ఇప్పించారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తనకు సీటు ఇవ్వాలని అడిగి మరీ ఇప్పించారన్నారు. ఇలా వారి ముగ్గురే తనకురాజకీయ భిక్ష పెట్టారని.. తర్వాత వైఎస్ కుటుంబం తనకు రాజకీయ భిక్ష పెట్టిందన్నారు. అంతేకానీ చంద్రబాబు కానీ.. ఆయన బాబు కర్జూర నాయుడు కానీ.. వాళ్ల తాత లవంగ నాయుడ్ని చూసి తాను టీడీపీలో చేరలేదన్నారు.
తాను రుణపడి ఉండేది ఎన్టీఆర్ కుటుంబానికి.. వైఎస్ కుటుంబానికి అని చెప్పిన కొడాలి నాని.. మరి.. అంతలా రుణపడి ఉంటే.. ఎన్టీఆర్ కుమార్తె మీద అంత దారుణమైన రీతిలో ఎలా వ్యాఖ్యలు చేస్తారన్న సూటి ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు.
అంతేకాదు.. తనకురాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ కుటుంబంలో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తప్పించి మిగిలిన ఇద్దరు స్వర్గస్తులయ్యారు. ఎన్టీఆర్ కుమార్తె మీద దారుణ రీతిలో వ్యాఖ్యలు చేసినప్పుడు.. తాతగారి కుమార్తెను అన్నేసి మాటలు అంటున్నప్పుడు.. జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నానిని కంట్రోల్ చేయాలి కదా? అన్న సందేహం ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్ అడిగినంతనే ఎన్టీఆర్ కోసం చంద్రబాబు కొడాలి నానికి టికెట్ ఇస్తే … మరి ఎన్టీఆర్ చేసిన పనివల్ల చంద్రబాబుకు అప్రతిష్ట వచ్చినపుడు, చంద్రబాబుకు అవమానం జరిగినపుడు దానిని సరిదిద్దాల్సిన బాధ్యత ఎన్టీఆర్ ది కాదా?
ఇది ఎన్టీఆర్ కు తెలిసినా ఎందుకు మౌనంగా ఉంటున్నారు. అంటే ఎన్టీఆర్ ని నమ్మి కొడాలి నానిని ఎమ్మెల్యే చేయడం చంద్రబాబు చేసిన తప్పనుకోవాలి. మరి ఇపుడు ఎన్టీఆర్ కూడా కొడాలి నాని చంద్రబాబును తిడుతుంటే ఎంజాయ్ చేస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది. ఎందుకు ఎన్టీఆర్ కొడాలి నానిని కంట్రోల్ చేయడం లేదు.
మరి.. దీనికి జూనియర్ ఎన్టీఆర్ ఏమని బదులిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.